కాప్పల్లెలో కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-12-01T05:45:30+05:30 IST

భూమి కంపించడంపై కాప్పల్లెలో ఆందోళన

కాప్పల్లెలో కంపించిన భూమి
పిల్లలతో కలసి వీధుల్లోకి వచ్చిన కాప్పల్లె గ్రామస్తులు

వీధుల్లోకి పరుగులు తీసిన గ్రామస్తులు 


రామసముద్రం, నవంబరు 30: ఉదయం ఆ గ్రామంలో భూమి లోపల నుంచి భారీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో కాప్పల్లె గ్రామస్తులు వీధుల్లోకి పరుగులు తీశారు. పెద్దలు, పిల్లలు చలికి వణుకుతూ ఆరుబయటే జాగారం చేసిన సంఘటన సోమవారం రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలివీ... మండలంలోని కాప్పల్లెలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భూమి నుంచి భారీ శబ్దం రావడం పలువురు గుర్తించినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఇలాంటి శబ్దాలే రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తారు. ఉదయం 8 గంటల సమయంలో గ్రామ కూడలి వద్ద ఉండగా భూమి నుంచి పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. 9 గంటల ప్రాంతంలో భూమి లోపల నుంచి పలురకాల శబ్దాలు విన్పించినట్లు కాప్పల్లె సచివాలయ కార్యదర్శి షబీనా పేర్కొన్నారు. మధ్యాహ్నంలోపు పలుమార్లు భూమి ప్రకంపనలు విన్నట్లు గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో పిల్లలు, పెద్దలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ధాటికి గ్రామ సచివాలయం పక్కనే నివసిస్తున్న నాగమ్మకు చెందిన ఇంటి గోడలు బీటలువారాయి. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు చలికి వణుకుతూ గంటల పాటు వీధుల్లో ఉండిపోయారు. దీంతో తహసీల్దార్‌ వేణయ్య ఈ సమాచారాన్ని కలెక్టర్‌ భరత్‌గుప్తా, సబ్‌కలెక్టర్‌ జాహ్నవికి అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సహాయక చర్యల నిమిత్తం పోలీసులు, వీఆర్‌ఏ, వీఆర్వోను ఆ గ్రామానికి పంపించారు. కాప్పల్లె, బైరాజుపల్లె గ్రామాల యువకులు తెల్లవార్లూ మేల్కొని ప్రజలకు సాయం చేయాలని తహసీల్దార్‌ పిలుపునిచ్చారు. కాగా, భూమి నుంచి శబ్దాలు రావడంపై మంగళవారం మదనపల్లెకు చెందిన జియాలజిస్టులు కాప్పల్లె చేరుకుని పరిశీలిస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో సిబ్బందితో కలసి కాప్పల్లె గ్రామానికి చేరుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ భూ ప్రకంపనల ధాటికి దెబ్బతిన్న ఇంట్లో ఉన్న నాగమ్మ ఆమె కుటుంబీకులను సమీప బంధువుల ఇంటికి తరలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై పాత ఇళ్లలో ఎవరూ నిద్రించరాదంటూ అప్రమత్తం చేశారు. 





Updated Date - 2020-12-01T05:45:30+05:30 IST