74,448 డ్వాక్రా సంఘాలకు రూ.175.82 కోట్ల వడ్డీ రాయితీ

ABN , First Publish Date - 2020-04-25T10:28:16+05:30 IST

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మహిళలకు ఓ వరమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.

74,448 డ్వాక్రా సంఘాలకు రూ.175.82 కోట్ల వడ్డీ రాయితీ

‘సున్నా వడ్డీ పథకం’ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం 


చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మహిళలకు ఓ వరమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం పట్టణాల పరిధిలోని 11,892 డ్వాక్రా సంఘాలకు రూ.20.60 కోట్లు, గ్రామీణప్రాంతాల్లోని 62,556 మహిళా సంఘాలకు రూ.155.22 కోట్ల మెగా చెక్కుల పంపిణీ జరిగింది.ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు.తిరుపతిలో కరుణాకర రెడ్డి, తిరుపతి రూరల్‌ మండలంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పలమనేరులో వెంకటేగౌడ,నగరిలో రోజా, సత్యవేడులో ఆదిమూలం,మదనపల్లెలో నవాజ్‌బాషా,తంబళ్లపల్లెలో ద్వారకనాథ రెడ్డి , వాల్మీకిపురంలో చింతల రామచంద్రా రెడ్డి,గుడిపాలలో ఆరణి శ్రీనివాసులు, తవణంపల్లెలో ఎమ్మెస్‌ బాబు,ఎస్సార్‌పురంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి,పుంగనూరు,కుప్పం నియోజకవర్గాల్లో అధికారులు డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు.


జిల్లాలోని 74,448 సంఘాలకు రూ.175.82 కోట్ల వడ్డీ రాయితీని అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం,కలెక్టర్‌ భరత్‌గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలో వైఎస్సార్‌ బీమా పథకం కింద పాలసీలు పొందిన వారిలో 52మంది ప్రమాదాల్లో మృతిచెందారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా మృతుల కుటుంబాలకు చెందిన నామినీలకు డిప్యూటీ సీఎం రూ.1.79 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాలు తయారు చేసిన మాస్కుల పంపిణీని ఆయనతోపాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ-2 చంద్రమౌళి, పీడీలు మురళి, జ్యోతి, ఏపీడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T10:28:16+05:30 IST