ద్రావిడ వీసీ నియామకంపై ఉత్కంఠ
ABN , First Publish Date - 2020-06-01T10:55:55+05:30 IST
కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం వీసీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది.
కుప్పం, మే 31: కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం వీసీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ ఆచార్య జి.లోకనాథరెడ్డి ఆదివారం పదవీ విరమణ చేశారు. రెగ్యులర్ వీసీగా ఉన్న సుధాకర్ బలవంతపు రాజీనామా తర్వాత 2019 సెప్టెంబరు 5 నుంచి ఈయన ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులున్నాయన్న ప్రచారముంది. అవే ఆశీస్సులతో మళ్లీ కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఏకపక్ష నిర్ణయాలతో ఒకవర్గాన్ని పెంచి పోషించిన ఆయనకు వ్యతిరేకంగా మరో బలమైన వర్గం ద్రావిడ వర్శిటీలో తయారైంది. ఈ వర్గంలోనూ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితులున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ లోకనాథరెడ్డి ఇన్‌చార్జి వీసీగా కొనసాగకుండా వ్యతిరేక వర్గం వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా నియమితులు కాగలిగిన సీనియర్లు ద్రావిడ వర్శిటీలో ఎవరూ లేరు. అందువల్ల.. పద్మావతి, ఎస్వీయూ వీసీల్లో ఎవరో ఒకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గతంలో ప్రయత్నాలు చేసిన ప్రొఫెసర్లలో ఎవరో ఒకరిని ఇన్‌ఛార్జి వీసీగా నియమించినా ఆశ్చర్య పోనక్కరలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జి వీసీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు రిజిస్ట్రార్ అనూరాధకు శుక్రవారమే చేరాయని, ఆమె వాటిని బయట పెట్టడంలేదని కొందరు అంటున్నారు. ఎవరు ఇన్‌చార్జి వీసీగా నియమితులు కావాలన్నా మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు మాత్రం తప్పనిసరని ద్రావిడ వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.