ఎన్‌-95 మాస్కులు మాకు లేవా?

ABN , First Publish Date - 2020-04-15T10:50:27+05:30 IST

అనారోగ్యంతో రోగులు తొలుత వచ్చేది రుయాలోని క్యాజువాలిటీకే. వారిని వెంటనే చూసేది నర్సులే.

ఎన్‌-95 మాస్కులు మాకు లేవా?

రుయా క్యాజువాలిటీలో సేవలందిస్తున్న సిబ్బంది ఆందోళన 


తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 14: అనారోగ్యంతో రోగులు తొలుత వచ్చేది రుయాలోని క్యాజువాలిటీకే. వారిని వెంటనే చూసేది నర్సులే. రోగికి కరోనా ఉందో లేదో అప్పటికి తెలియదు. వీరికి దగ్గరగా సేవలందించాలి. ఒకవేళ వీరిలో పాజిటివ్‌ రోగి ఉంటే తమ పరిస్థితి ఏమిటన్నది అక్కడి సిబ్బంది ఆందోళన. తమ కుటుంబాలకూ ప్రమాదమేనని కలవర పడుతున్నారు. అందుకనే ఎన్‌-95 మాస్కు లు కావాలని అడుగుతున్నారు. అధికారులేమో వీరికి సర్జికల్‌ మాస్కులతో సరిపెడుతున్నారు. తిరు పతి రుయాస్పత్రిలో నర్సులు, పారిశుధ్య సిబ్బంది, స్ట్రెచర్‌ బాయ్స్‌కు కరోనా వైరస్‌ నివారణకు ఉపయో గించే ఎన్‌-95 మాస్కుల కొరత ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల నుంచి రుయాలో కరోనా వైరస్‌ కేసులు నిత్యం వస్తున్నాయి.


వీరికోసం పాత ప్రసూతి ఆస్పత్రి భవనంలో కరోనా ఓపీ, కరోనా ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వార్డులో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేదు, వీరందరికీ పీపీఈ సూట్లు, ఎన్‌-95 మాస్కులు ఇస్తున్నారు. అయితే, క్యాజువాలిటీ, ఏఎంసీ, ఆర్‌ఐసీయూ వార్డుల్లో పనిచేసే నర్సులు, పారిశుధ్య సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు ఇవ్వడంలేదు. దీంతో వీరు భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో గ్రేడ్‌-1, 2 పేరుతో ఇద్దరు నర్సింగ్‌ సూపరిం టెండెంట్లు, 260 మంది స్టాఫ్‌ నర్సులు, 37 మంది హెడ్‌ నర్సులు, కాంట్రాక్టు పద్ధతిలో 75 మంది నర్సులు పనిచేస్తున్నారు.


వీరిలో రుయా కరోనా వార్డులో ఆరుగురు హెడ్‌ నర్సులు, ముగ్గురు కాంట్రాక్టు నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా వార్డును మినహాయిస్తే మిగిలిన వార్డుల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న వారికి నెల రోజులుగా మాస్కులు సక్రమంగా ఇవ్వడంలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులకు వైద్యం చేస్తారో, ఎవరైతే అలాంటి లక్షణాలతో వైద్య పరీక్షల కోసం వస్తారో వారికి మాత్రమే సురక్షితమైన ఎన్‌-95 మాస్కులను ఉపయోగించాల్సి ఉంది. అదే క్యాజువాలిటీ, ఏఎంసీ, ఆర్‌ఐసీయు వార్డులో రోగులకు వైద్యం అందించే నర్సులు, పారిశుధ్య సిబ్బందికి మాత్రం సర్జికల్‌ మాస్కులను ఇస్తున్నారు. క్యాజువాలిటీకి వచ్చే రోగ్గుల్లో ఒకవేళ పాజిటివ్‌ ఉండేవారు ఎవరైనా ఉంటే తమ పరిస్థితి ఏంటన్నదే వీరి భయం. వీరి ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాల్సి ఉంది.


ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నాం 

ఎన్‌-95 మాస్కులు తక్కువగా ఉండటం వల్ల అందరికీ ఇవ్వలేక పోతున్నాం. ప్రాధాన్య క్రమంలో కరోనా వార్డుకు వచ్చే అత్యవసర కేసులను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో మాస్కులు రాగానే అందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ హరికృష్ణ,  ఆర్‌ఎంవో, రుయాస్పత్రి 


ఇబ్బంది లేదు 

ఎన్‌-95 మాస్కులు అందరికీ ఇవ్వలేం. పాజిటివ్‌ కేసులకు వైద్య సేవలు అందిస్తున్న వారికే ఇస్తున్నాం. ప్రస్తుతం కరోనా వార్డులో రోజుకు 60 మాస్కులను ఇస్తున్నాం. ఎవరికైనా అవసరమైతే మేము గుర్తించి ఇస్తున్నాం. ప్రస్తుతం మాస్కులతో ఇబ్బంది లేదు.

- అరుణమ్మ, గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, రుయాస్పత్రి 

Updated Date - 2020-04-15T10:50:27+05:30 IST