-
-
Home » Andhra Pradesh » Chittoor » distribution of housing places in urandur today
-
నేడు ఊరందూరులో ఇళ్ల స్థలాల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-28T06:44:07+05:30 IST
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని విష్ణు కెమికల్స్ వద్ద వేసిన లే అవుట్‌లో సోమవారం సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేయనున్నారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు 27: శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని విష్ణు కెమికల్స్ వద్ద వేసిన లే అవుట్‌లో సోమవారం సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేయనున్నారు. అక్కడే బహిరంగ సభ జరగనుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ మొత్తం 160 ఎకరాల్లో 5,768మందికి స్థలాలను కేటాయించారు. ఈ సభలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ రేణిగుంటకు ఉదయం 10.45 గంటలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో 11.20 గంటలకు సభాస్థలికి వచ్చి తొలుత పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమవుతారు. సభా ఏర్పాట్లను ఆదివారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణ సలహాదారు రఘురాం, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదనరెడ్డి, నవాజ్‌బాషా, కలెక్టర్ భరత్‌గుప్తా, జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్ తదితరులు పరిశీలించారు.
సీఎం సభకు రావాల్సిందే
సీఎం సభకు జన సమీకరణ బాధ్యత మెప్మా, వెలుగు అధికారులకు అప్పగించారు. దీంతో వీరు స్వయం సహాయక సంఘం సభ్యులందరూ సభకు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆదివారం మెప్మా వారు స్వయం సహాయక సంఘం లీడర్లతో సమావేశమై.. గ్రూపులోని సభ్యులందరినీ తీసుకొచ్చే బాధ్యత వారికి అప్పగించారు. సభకు వచ్చే వారి నుంచి సంతకాలు తీసుకోవాలని సూచించారు. కాగా, సభకు రాకుంటే రూ.500 విధిస్తామని అధికారులు హెచ్చరించారన్న ప్రచారం సాగుతోంది.
