‘అదనపు’ పని మావల్ల కాదు !

ABN , First Publish Date - 2020-03-02T10:34:19+05:30 IST

పేద, బడుగు వర్గాలకు అందజేయనున్న ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ల కార్యాలయాల్లో చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ వర్గాలు హడలెత్తిపోతున్నాయి.

‘అదనపు’ పని మావల్ల కాదు !

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతపై రెవెన్యూ వర్గాల గగ్గోలు


 చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 1: పేద, బడుగు వర్గాలకు అందజేయనున్న ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ల కార్యాలయాల్లో చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ వర్గాలు హడలెత్తిపోతున్నాయి. మండలాల తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ (జేఎస్‌ఆర్‌) అధికారాలను దఖలుపరుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి విదితమే. గత ప్రభుత్వాల హయాంలో అర్హులకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసినా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఈసారి వైసీపీ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల పేరిట స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంటు కూడా ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది రోజువారీ పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల బాధ్యతను అదనంగా అప్పగించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. మండలాల కార్యాలయాల్లో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఇద్దరు ఆర్‌ఐలు, సీనియర్‌, జూనియర్‌ సహాయకులు, నాలుగో తరగతి ఉద్యోగి కలిపి మొత్తం ఏడుగురు సేవలందిస్తున్నారు. చాలా మండలాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఇప్పటికే వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధి వంటి పనులతో తహసీల్దార్లు గుక్కతిప్పుకోలేని స్థితిలో ఉన్నారు.


అదనపు సిబ్బంది లేకుండా ఎలా ?

జిల్లాలో 1,07,714 మందికి ఇళ్ళపట్టాలు పంపిణీ చేయాల్సివుంది. ఇప్పటికే 1146 ప్రాంతాల్లో 1927 ఎకరాలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో 68,600 మందికి, పట్టణ ప్రాంతాల్లో 39,114 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదాహరణకు బంగారుపాళ్యం మండలంలో 1720 మంది అర్హులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. నిర్ణీత వ్యవధిలో అందించాలంటే అదనపు సిబ్బంది అవసరమని అధికారులు అంటున్నారు. పైగా ఈ పట్టాలకు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్లు అందుబాటులో ఉండాలి. దీనివల్ల ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకుసాగవు. రిజిస్ట్రేషన్లు చేయాలంటే సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఉన్న ఆన్‌లైన్‌ విధానాన్ని తహసీల్దారు ఆఫీసుకు అనుసంధానం చేయాలి. రిజిస్ట్రేషన్‌ ఎలా చేయాలో జీవోలో స్పష్టత లేదు. కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను తహసీల్దార్లకు దఖలు పరుస్తూ మాత్రమే జీవోలో ఉంది. ఇతర అంశాలపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సివుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

Updated Date - 2020-03-02T10:34:19+05:30 IST