భక్తులకు అందని శ్రీవారి ప్రసాదం.. వీఐపీ బ్రేక్ దర్శనంలో నిరసన

ABN , First Publish Date - 2020-12-13T15:25:57+05:30 IST

తిరుమల: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంలో భక్తులు నిరసనకు దిగారు.

భక్తులకు అందని శ్రీవారి ప్రసాదం.. వీఐపీ బ్రేక్ దర్శనంలో నిరసన

తిరుమల: శ్రీవారి దర్శనం తర్వాత ఇచ్చే ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆలయం బయట కొనుక్కునే లడ్డూల కంటే ఇక్కడ అందించే ప్రసాదాన్ని భక్తులు అమృతంగా భావిస్తారు. అలాంటి ప్రసాదం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్న భక్తులకు దక్కలేదు. దీంతో భక్తులు నిరసనకు దిగారు. ప్రోటోకాల్ పరిధిలోని వారికి ప్రసాదం పంపిణీ చేసి... భక్తులకు ఇవ్వరా అంటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వందలాది భక్తలు ఆలయంలో ఆందోళనకు దిగగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో పిల్లాపాపలతో దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకున్నవారికి ప్రసాదాలు లేకుండా పోయాయి. దీంతో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ప్రసాదాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల వైఖరికి నిరసనగా ఆలయం వెలుపల భక్తులు నినాదాలు చేశారు. బయట లడ్డూలు అమ్ముతున్నారుగా అని సిబ్బంది ఉచిత సలహాలు ఇచ్చారంటూ హైదరాబాద్ భక్తుడు ఒకరు మండిపడ్డారు. బహుశా వీఐపీ దర్శనాలకు వచ్చే వారికి ప్రసాదం అందకుండా పోవడం చరిత్రలో ఇదే తొలిసారేమోనని ఆంధ్రజ్యోతితో ఆయన అన్నారు. ‘లడ్డూలు కొనుక్కోవాలన్న విషయం తమకు తెలియదా... సిబ్బందే తమకు చెప్పాలా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


Updated Date - 2020-12-13T15:25:57+05:30 IST