ఇలాగైతే ఎలా?

ABN , First Publish Date - 2020-07-22T11:37:32+05:30 IST

జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు శ్రీకాళహస్తి పట్టణంలో మార్చి 24వ తేదీన నమోదైంది. అప్పటి నుంచి పట్టణంలో కరోనా

ఇలాగైతే  ఎలా?

వృథాగా పోతున్న నమూనాలు 

కరోనా నిర్ధారణలో తీరని జాప్యం 


కరోనా వ్యాధి లక్షణాలున్న వారి నుంచి  సేకరిస్తున్న నమూనాలు వృథాగా పోతున్నట్లు సమాచారం. అంతకంతకు వ్యాధి విస్తరిస్తున్నా సకాలంలో ఫలితాలు వెలువడడంలేదు. ఫలితాల ఆలస్యం మరింత వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది.


శ్రీకాళహస్తి అర్బన్‌ : జిల్లాలో తొలి  కరోనా పాజిటివ్‌ కేసు శ్రీకాళహస్తి పట్టణంలో మార్చి 24వ తేదీన నమోదైంది. అప్పటి నుంచి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏప్రిల్‌ 6వతేదీ నుంచి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనే అనుమానితుల నుంచి నమూనాలు సేకరించడం ప్రారంభించారు. తిరుపతికి తరలించి ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడించేవారు.మే, జూన్‌ నెలల్లో జిల్లావ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి అధికమైంది. పాజిటివ్‌ కేసులతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల సంఖ్య కూడా రెట్టింపవుతూ వస్తోంది. ఈ క్రమంలో వ్యాప్తిని అడ్డుకోవాలంటే పరీక్షలు విస్తారంగా జరిపి పాజిటివ్‌ కేసులను త్వరగా నిర్ధారించడంతో పాటు వెంటనే చికిత్సలు అందించడం ఒకటే మార్గం.


కేసులు పెరిగేకొద్దీ నిర్ధారణ ఫలితాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి.మొదట్లో ఒకటి రెండురోజుల్లో వచ్చే ఫలితాలు ప్రస్తుతం పది రోజులు గడిచినా వెలువడడంలేదు. ఈ నెల 8, 9, 10, 11, 12 తేదీల్లో సేకరించిన నమూనాల ఫలితాలు ఇప్పటివరకు వెల్లడించలేదు. నమూనాలు ఇచ్చినవారు రోజూ ఫలితాల కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పది రోజుల తరువాత మంగళవారం 8 నుంచి 12వ తేదీ వరకు పంపిన అన్ని నమూనాలు రిజక్ట్‌ అయినట్లు ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. పరీక్షలు చేయించుకున్నవారిలో పాజిటివ్‌ కేసులుంటే ఇన్ని రోజుల వ్యవథిలో ఒకరి నుంచి ఒకరికి ఎంతగా వ్యాప్తిచెంది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి వందలాది కిట్లతో తీసిన నమూనాలు  పనికిరాకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.


జిల్లా మొత్తం నుంచి ఆ తేదీల్లో తిరుపతికి వెళ్లిన నమూనాలు దాదాపుగా రిజక్ట్‌ అయినట్లు సమాచారం. అదే తేదీల్లో శ్రీకాళహస్తికి చెందిన కొందరు వైద్యా ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బంది కూడా నమూనాలు ఇచ్చారు.వారి ఫలితాలు కూడా రిజెక్టడ్‌గా తేలింది.                   


సిఫార్సులకే పెద్దపీట:ఫ్యాక్ట్‌ 

శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ కోసం సిఫార్సులున్నవారికి, పోలీసులకు, రాజకీయ నాయకులకు సంబంధిం చిన వారికే ప్రాధాన్యత కల్పిస్తోన్నట్లు ఫ్యాక్ట్‌ స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు, విశ్రాంత  ప్రభుత్వ వైద్యుడు చింతలపూడి డీవీ రావు ఆరోపించారు.కరోనా నిర్ధారణ ఫలితాలు జాప్యమవడం మంచిది కాద న్నారు. సకాలంలో ఫలితాలు వస్తేనే కట్టడి చేయడం అంతంత మాత్రం గా ఉన్న తరుణంలో ఇలాంటి నిర్లక్ష్యం బాధాకరమన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో పేదలు కరోనా నిర్ధారణ కోసం వెళితే సిబ్బంది సరిగ్గా స్పందించడంలేదన్నారు.అనుమానితులందరికీ నిర్ధారణ పరీక్షలు జరిపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 


అందరికీ పరీక్షలు జరుపుతున్నాం

శ్రీకాళహస్తి ఆస్పత్రిలో అనుమానితులందరికీ పరీక్షలు జరుపుతున్నామని సూపరింటెండెంట్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పాజిటివ్‌ కేసుల  ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వైద్యశాఖ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తున్నారని చెప్పారు. వారు గుర్తించిన కాంటాక్టు ప్రకారం నమూనాల సేకరణలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అలాగే ఆస్పత్రికి వచ్చే గర్భవతులు, తీవ్రమైన వ్యాధిలక్షణాలు ఉన్నవారికి కూడా  ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.రోజూ తిరుపతి రుయాస్పత్రి నుంచి జిల్లా అధికారులు శ్రీకాళహస్తికి పరిమిత సంఖ్యలో కిట్లు ఇవ్వడం  జరుగుతోందన్నారు.


కిట్ల అందుబాటును బట్టి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. కిట్ల కొరత ఉన్న రోజుల్లో పరీక్షలు కోసం వచ్చే వారిని తిప్పి పంపాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వారికే ముందుగా పరీక్షలు జరుపుతున్నామన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో ఒకే ట్రూనాట్‌ యంత్రం ఉందన్నారు. త్వరలో మరికొన్ని యంత్రాలను అధికారులు ఏర్పాటు చేస్తే పరీక్షల సంఖ్య మరింత పెంచుతామన్నారు. 


Updated Date - 2020-07-22T11:37:32+05:30 IST