భూగర్భ జలాల అభివృద్ధికి రూ.288 కోట్లతో ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-03-02T10:35:39+05:30 IST

జిల్లాలోని తూర్పు ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధిపై జలవనరులశాఖ దృష్టిసారిస్తోంది.

భూగర్భ జలాల అభివృద్ధికి రూ.288 కోట్లతో ప్రతిపాదనలు

డీపీఆర్‌కు రూ.64లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం


చిత్తూరు (వ్యవసాయం), ఫిబ్రవరి 28: జిల్లాలోని తూర్పు ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధిపై జలవనరులశాఖ దృష్టిసారిస్తోంది. రూ.288 కోట్లతో వివిధ పనుల మంజూరు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాద నలను పంపింది. పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ రెండు నిర్మాణాలకు అవసరమైన డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)ను తయారు చేయడానికి రూ.64 లక్షలను కూడా మంజూరు చేశారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. 


రూ.116 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు

శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని చెరువులు, కాలువల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టడానికి రూ.116 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే స్వర్ణముఖి నదిలో రేణిగుంట నుంచి నెల్లూరు సరిహద్దు వరకు కొత్తగా రూ.15 కోట్లతో ఎనిమిది సబ్‌సర్ఫేస్‌ డ్యాముల నిర్మాణాలను చేపట్టేలా ప్రతిపాదించారు. ఈ డ్యాముల నిర్మాణాలను సిమెంటు కాంక్రీటుతో కాకుండా బంకమట్టితో చేపట్టడానికి ప్రతిపాదించారు. బంకమట్టితో నిర్మిస్తే తక్కువ ఖర్చుతో చేపట్టే వీలుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా వీటినే ప్రోత్సహిస్తోంది. నదీగర్భంలో గాడితీసి బంకమట్టిని నది ఉపరితలం వరకు నింపడంతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. సదాశివకోన పరిధిలో ఏడు చెరువుల అభివృద్ధికి రూ.18కోట్లతో ప్రతిపాదనలు పంపారు. చెరువు కట్టల బలోపేతంతోపాటు కాలువల రిపేర్లు తదితరాలను ప్రతిపాదించారు. మల్లెమడుగు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.21కోట్లతో, వికృతమాల పరిసర చెరువుల అభివృద్ధికి రూ.15కోట్లతో ప్రతిపాదనలు పంపారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో సత్యవేడు, కేవీబీపురం మండలాల్లో రూ.45కోట్లతో 27 చెక్‌డ్యాముల నిర్మాణాలను చేపట్టడానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. ఇవన్నీ వీలైనంత త్వరగా మంజూరు కానున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. 


రూ.100 కోట్లతో స్వర్ణముఖి బ్యారేజ్‌ నిర్మాణం

శ్రీకాళహస్తి పట్టణ తాగునీటి అవసరాలతోపాటు నియోజకవర్గ పరిధిలోని పలుగ్రామాలకు సాగునీటి వసతి కల్పన కోసం ప్రస్తుతమున్న స్వర్ణముఖి ఆనకట్ట స్థానంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని జలవనరులశాఖ అధికారులు యోచించారు. దీనివల్ల ఏడాది పొడవునా పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే వీలుంటుంది. దీనికోసం రూ.100 కోట్ల అవసరం కానుంది.  దీన్ని గుర్తించే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


రూ.72 కోట్లతో చెంబేడు సిస్టమ్‌

స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో చెంబేడు సిస్టమ్‌ అమలుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. రూ.72 కోట్లతో ఈ విధానం ఏర్పాటు చేస్తే శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని 12వేల ఎకరాల భూమికి సాగు నీరందుతుంది. ఈ రెండుపనులకు సంబంధించిన డీపీఆర్‌ తయారీకే రూ.64 లక్షలు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.

Updated Date - 2020-03-02T10:35:39+05:30 IST