హోటళ్లకు కొవిడ్‌ బాధితులు

ABN , First Publish Date - 2020-09-03T10:14:19+05:30 IST

భోజనం కోసం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి నుంచి కొవిడ్‌ బాధితులు హోటళ్లకు వెళ్తున్నారు...

హోటళ్లకు కొవిడ్‌ బాధితులు

శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో ఆగిన భోజన సరఫరా 

సాధారణ రోగులకూ ఆకలికేకలు 


శ్రీకాళహస్తి, సెప్టెంబరు 2: భోజనం కోసం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి నుంచి కొవిడ్‌ బాధితులు హోటళ్లకు వెళ్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. ఇక సాధారణ రోగులు ఇళ్ల నుంచి తెప్పించుకుంటున్నారు. రెండురోజులుగా భోజన సరఫరా లేకపోవడమే దీనికి కారణం. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాల్సి ఉంది. దీని కాంట్రాక్టరు గడువు ఆరు నెలల కిందట ముగిసింది. ఆ తర్వాత టెండరు నిర్వహించినా.. ఏ కారణాల వలనో ఇప్పటి వరకు కాంట్రాక్టరు భోజనం సరఫరా చేయలేదు. దీంతో ఆస్పత్రి అధికారుల  విజ్ఞప్తి ఆరు నెలలుగా ముక్కంటి ఆలయం వారే రోగులకు భోజనం సరఫరా చేస్తున్నారు. దీంతో భోజన సమస్య బయటపడలేదు. కాగా, శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిని కొవిడ్‌కు సంబంధించి ట్రైయేజ్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోమ్‌ ఐసొలేషన్‌కు పంపడం, లేదా తిరుపతికి పంపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం 20 మంది వరకు కొవిడ్‌ బాధితులున్నారు.


వీరే కాకుండా కాన్పులు, ఇతర చికిత్సలకు వచ్చిన వారు మరో 20 మంది వరకున్నారు. వీరందరికీ ఆలయం వారే భోజనం సరఫరా చేసేవారు. రెండు రోజులుగా సాధారణ రోగులకు, కొవిడ్‌ బాధితులకు ఆలయం నుంచి భోజనం రాలేదు. ఆలయం వారు దయాదాక్షిణ్యాలతో భోజనం పంపుతున్నందున ఆస్పత్రి వర్గాలు వారిని గట్టిగా అడగలేకపోతున్నాయి. ఇక టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు కూడా రాలేదు. దీంతో సాధారణ రోగులు రెండు రోజులుగా బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన కొవిడ్‌ బాధితులు భోజనం కోసం హోటళ్లకు వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


భోజనం ఆగింది వాస్తవమే

కొవిడ్‌ బాధితులకు, సాధారణ రోగులకు రెండు రోజులుగా భోజనం సరఫరా ఆగిన మాట వాస్తవమే. ఆరు నెలల కిందట టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇంతవరకు రాలేదు. ఈ విషయం అధికారుల దృష్టికీ తీసుకెళ్లా. మా అభ్యర్థనతో ముక్కంటి ఆలయ అధికారులు భోజనం సరఫరా చేసేవారు. ఎందుకో రెండు రోజులుగా వారు సరఫరా చేయడంలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రత్యేక నిధుల్లేనందున రోగులకు భోజనం పెట్టలేక పోతున్నాం. ఉన్నతాధికారులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తాం.

- డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 


Updated Date - 2020-09-03T10:14:19+05:30 IST