తిరుపతిలో మాస్కుల కొరత

ABN , First Publish Date - 2020-03-02T10:33:03+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం వైద్య సిబ్బంది ధరించే మాస్కులపై పడింది. తిరుపతిలో రెండు రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాస్కుల కొరత కనిపిస్తోంది.

తిరుపతిలో మాస్కుల కొరత

స్విమ్స్‌లో మాస్కులు, గ్లౌజులు నో స్టాక్‌

గుడ్డతో మాస్కుల తయారీకి యత్నం

ఆందోళన చెందుతున్న వైద్య సిబ్బంది


తిరుపతి, మార్చి1 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావం వైద్య సిబ్బంది ధరించే మాస్కులపై పడింది. తిరుపతిలో రెండు రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాస్కుల కొరత కనిపిస్తోంది. డిస్పోజబుల్‌ మాస్కులు విక్రయించే సర్జికల్‌ ఏజెన్సీలలో కూడా స్టాకు లేదు. కొన్నిచోట్ల ఉన్న మాస్కులనే పొదుపుగా వాడుకుంటున్నారు. చైనాలో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చి, దిగుమతులు మొదలైతేగానీ మాస్కులు అందుబాటులోకి రావని చెబుతున్నారు. దీంతో ఆకుపచ్చని రంగు గుడ్డతో మాస్కులను తయారు చేసుకునే పనిలో ఆస్పత్రులు పడ్డాయి. స్విమ్స్‌ ఆస్పత్రిలో రెండు రోజుల కిందటి వరకు 3 వేల మాస్కులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఎంత పొదుపుగా వాడుకున్న రెండు రోజులకుపైగా సరిపోవు. ఆదివారం నుంచి స్విమ్స్‌లో పూర్తిగా మాస్కులు అయిపోయాయి. దీంతో సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుడ్డతో మాస్కుల తయారీకి స్విమ్స్‌ సిద్ధమవుతోంది. వాటినే మళ్లీ స్టెరిలైజ్‌ చేసి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీటిపై సిబ్బంది ఆసక్తి చూపడంలేదు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌ అనుమానంతో రుయాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చైనా దేశస్తుడు చికిత్స తీసుకుంటున్నారు. రుయాస్పత్రిలోనూ మాస్కులు లేకపోవడంతో నిఫా వైరస్‌ నేపథ్యంలో తెప్పించుకున్న ప్రత్యేక మాస్కులను ఇక్కడ సిబ్బంది వినియోగించుకుంటున్నారు. వీటిని శుభ్రం చేసుకుని మళ్లీ, మళ్లీ వాడుకోవచ్చు. 


డిమాండు అందుకే 

డిస్పోజబుల్‌ మాస్కులకు సంబంధించిన ముడి పదార్థం చైనా నుంచి వస్తుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు నిలిచిపోవడంతో మాస్కుల తయారీకి అడ్డంకిగా మారింది. ఇదివరకు వైద్య సిబ్బంది మాత్రమే మాస్కులు వినియోగించేవారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా మాస్కులు తగిలించుకోవడంతో డిమాండ్‌ పెరిగింది. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉన్నవాటిని అధికధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. రీటైల్‌ మార్కెట్‌లో ఒక మాస్కు రూ.5 ఉండేది. ఇప్పుడు రూ.20 చెబుతున్నారు.


మాస్కుల కొరత నిజమే .. యర్రంరెడ్డి, జీఎం (పర్చేస్‌), స్విమ్స్‌

స్విమ్స్‌లో మాస్కుల కొరత నిజమే. దేశవ్యాప్తంగా ఎక్కడా సరఫరా లేవు. ప్రత్యామ్నాయంగా గుడ్డతో 500 మాస్కులు తయారు చేసి వాటినే స్టెరైల్‌ చేసి తిరిగి వాడుకుంటాం. ముందస్తుగా కొనుగోలు చేయకపోవడానికి దాదాపు రూ.35కోట్లకు పైగా ఆరోగశ్రీ బకాయిలు ఉన్నాయి. 


Updated Date - 2020-03-02T10:33:03+05:30 IST