కొనసాగుతున్న కరోనా విజృంభణ
ABN , First Publish Date - 2020-08-11T11:22:16+05:30 IST
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏరోజుకారోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

నాలుగు మండలాల్లో నాలుగంకెలకు చేరిన కేసులు
19చోట్ల మూడంకెల్లో... వందకు చేరువలో మరో మూడు మండలాలు
తిరుపతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏరోజుకారోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రెండు రోజులకూ కేసుల సంఖ్య వెయ్యి దాటుతోంది. జిల్లాలోని 66 మండలాలకు గానూ కేవలం మూడు మండలాల్లోనే సింగిల్ డిజిట్ కేసులుండగా 41 మండలాల్లో డబుల్ డిజిట్, 19 మండలాల్లో త్రిబుల్ డిజిట్, మూడు మండలాల్లో నాలుగు డిజిట్లలో కేసులున్నాయి.జిల్లాలో 18 వేలకు పైగా నమోదైన కరోనా కేసుల్లో 60 శాతం తిరుపతి నగరం, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి మండలాల్లోనే వుండడం గమనార్హం. తిరుపతి నగరంలో 9వ తేదీ నాటికే 8122 కేసులు నిర్ధారణ కాగా రూరల్ మండలంలో 1581 కేసులు, శ్రీకాళహస్తిలో 1105 కేసులు చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఇవన్నీ కలిపితే 10808 కేసులు. అంటే జిల్లాలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో అక్షరాలా 60 శాతం. ముఖ్యంగా తిరుపతి నగరం, రూరల్ మండలాల్లో కలిపి 9703 కేసులు నమోదు కావడం ఇక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మరో 19 మండలాల్లో కేసులు మూడంకెలకు చేరాయి. చిత్తూరు 930 పాజిటివ్ కేసులతో వెయ్యికి చేరువలో వుండగా పుత్తూరులో 678, మదనపల్లెలో 573, చంద్రగిరిలో 410, నగరిలో 399, రేణిగుంటలో 337, నారాయణవనంలో 214, పలమనేరులో 172, సత్యవేడులో 171, బంగారుపాళ్యంలో 166, ఏర్పేడులో 165, పాకాలలో 127, పుంగనూరులో 126, పీలేరులో 120, నిండ్ర, వడమాలపేట మండలాల్లో 118 చొప్పున, రామచంద్రాపురంలో 115, కలికిరిలో 111, నాగలాపురంలో 103 చొప్పున కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇతర జిల్లాలకు సంబంధించిన కేసులు 388 వున్నాయి. ఇంకో 41 మండలాల్లో కేసుల సంఖ్య రెండంకెల్లో వున్నాయి. ప్రత్యేకించి వీటిలో పిచ్చాటూరు 91, విజయపురం 90, వరదయ్యపాలెం 89 చొప్పున కేసులతో వందకు చేరువలో వున్నాయి. మూడు మండలాలు మాత్రమే... పీటీఎం 9, శాంతిపురం 8, గుడుపల్లె 5 చొప్పున సింగిల్ డిజిట్ కేసులను కలగివున్నాయి.
కొత్తగా 551 కరోనా పాజిటివ్‌ల గుర్తింపు
జిల్లాలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచీ సోమవారం రాత్రి 9 గంటల వరకూ 551 కరోనా కేసులను అధికారులు గుర్తించారు. ఇందులో సోమవారం ఉదయం 9 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ నమోదైనవి 238 వున్నాయి. ఈ కేసులు పులిచెర్లలో 53, తిరుపతి నగరంలో 39, తిరుపతి రూరల్ మండలంలో 5, వాల్మీకిపురంలో 27, మదనపల్లెలో 25, గుర్రంకొండలో 23, బంగారుపాళ్యంలో 13, చిత్తూరులో 10, కురబలకోటలో 8, నిమ్మనపల్లె, పీలేరు, రేణిగుంట, సదుం మండలాల్లో 3 చొప్పున, బి.కొత్తకోట, కలికిరి, తంబళ్ళపల్లె మండలాల్లో 2 చొప్పున, శ్రీకాళహస్తి, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, కేవీపల్లె, పాకాల, పీటీఎం, పుంగనూరు, సోమల మండలాల్లో ఒక్కొక్కటి వుండగా ఇతర జిల్లాల కేసులు 7 వున్నాయి. కాగా తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 18932కు చేరుకుంది.
నిధుల లేమితో ఆగిన రూ.రెండు వేల సాయం
ఆస్పత్రులనుంచి కొవిడ్ బాధితుల డిశ్చార్జి సమయంలో ఇస్తున్న రెండు వేల రూపాయల సాయం ఆగిపోయింది. నాలుగు రోజులుగా ఆస్పత్రుల వద్ద, కేర్ సెంటర్స్ వద్ద డబ్బులు ఇవ్వడం లేదు.అడిగినవారికి మీ అకౌంట్‌కు పంపిస్తామని చెబుతున్నారు.నిధులు లేని కారణంగానే చెల్లింపులు ఆపేసినట్టు సమాచారం.
మృతుల విషయంలో బులెటిన్ల నడుమ తేడా
కొవిడ్ మరణాల సంఖ్య విషయంలో మాత్రం జిల్లా అధికార యంత్రాంగం జారీ చేస్తున్న ప్రకటనకూ, రాష్ట్ర బులెటిన్‌కూ నడుమ తేడా కొనసాగుతూనే వుంది.ఆదివారం వరకూ జిల్లాలో 184మంది కొవిడ్‌తో మృతి చెందినట్టు జిల్లా యంత్రాంగం బులెటిన్‌లో పేర్కొనగా 10వ తేదీ ఉదయం విడుదలైన రాష్ట్ర బులెటిన్‌లో సోమవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన మరణాల సంఖ్య 177గా నమోదైంది.