కరోనా లక్షణాలుంటేనే అడ్మిట్‌ చేసుకుంటున్నాం

ABN , First Publish Date - 2020-03-29T11:17:39+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రుయాస్పత్రిలో కోవిడ్‌ వార్డు ఏర్పాటైంది.

కరోనా లక్షణాలుంటేనే   అడ్మిట్‌ చేసుకుంటున్నాం

భయంతో రోజూ ఆస్పత్రికివందమంది వస్తున్నారు

ఐసోలేషన్‌ కేంద్రాలు పెట్టడానికి ముందుకొస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు 

 ‘ఆంధ్రజ్యోతి’తో రుయా సూపరింటెండెంట్‌ రమణయ్య


తిరుపతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రుయాస్పత్రిలో కోవిడ్‌ వార్డు ఏర్పాటైంది. జిల్లాలో తొలి పాజిటివ్‌ వచ్చిన యువకుడు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. సాధారణ జలుబు, దగ్గు ఉన్నవారు కూడా భయపడి రోజుకు వంద మంది వరకు పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తున్నారు. ఈనేపథ్యంలో రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్వీ రమణయ్య ‘ఆంధ్రజ్యోతి’తో శనివారం మాట్లాడారు. ‘కరోనా లక్షణాలున్నాయన్న భయంతో రోజుకు 80 నుంచి 100 మంది ఆస్పత్రికి వస్తున్నారు. వీరిని పరీక్షించి కరోనా లక్షణాలుంటేనే అడ్మిట్‌ చేసుకుంటున్నాం. తక్కినవారిని హోమ్‌ క్వారంటైన్‌కు పంపుతున్నాం.


నెగిటివ్‌ వచ్చినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండమంటున్నాం. ఇంట్లో వీలుకాకపోతే తిరుచానూరు సమీపంలో ఉన్న పద్మావతి నిలయంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు రెఫర్‌ చేస్తున్నాం. అక్కడ అన్ని వసతులున్నాయి. వచ్చేనెల 14 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సిందే. రుయా కన్నా అన్ని వసతులుండడం వల్ల పద్మావతి మెడికల్‌ కాలేజీని కోవిడ్‌ ఆస్పత్రిగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రుయా ఐసోలేషన్‌లో ఇద్దరే ఉన్నారు. వైద్య సిబ్బందికి  మాస్కులు, పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌పెంట్‌)లు  లేవు. అమరరాజ సంస్థ కొన్ని వితరణ చేసింది. ఎస్బీఐ ఇస్తామంటోంది. దాతలు ముందుకొస్తున్నా పరికరాల ధరలు అందుబాటులోకి లేవు. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలు పెట్టాల్సి వస్తోంది. ఐసోలేషన్‌ కేంద్రాలు పెట్టడానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా ముందుకు వస్తున్నాయి. ఇదొక శుభపరిణామం. అందరూ కలిస్తేనే కరోనాను అరికట్టడం సాధ్యమవుతుంది’ అన్నారు. 

Updated Date - 2020-03-29T11:17:39+05:30 IST