-
-
Home » Andhra Pradesh » Chittoor » corona tests
-
ఇదేం పరీక్ష..?
ABN , First Publish Date - 2020-06-23T10:25:46+05:30 IST
కరోనా పరీక్షల్లో అయో మయం నెలకొంటోంది. నిర్దిష్ట క్రమపద్ధతి లేకుండా ఫలితాలు వెలువుడుతున్నాయి.

నిర్దిష్ట సమయంలో వెలువడని కరోనా ఫలితాలు
అయోమయంలో అనుమానితులు
శ్రీకాళహస్తి అర్బన్, జూన్ 22: కరోనా పరీక్షల్లో అయో మయం నెలకొంటోంది. నిర్దిష్ట క్రమపద్ధతి లేకుండా ఫలితాలు వెలువుడుతున్నాయి. శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోనే అత్యధికంగా శ్రీకాళహస్తిలో కరోనా పరీక్ష లు నిర్వహించారు. అయితే ఫలితాల్లో మాత్రం గందరగోళం తప్పడంలేదు. ఇటీవల పట్టణంలో జరిగిన కొన్ని ఘటనలు కలవరపెడుతున్నాయి. ఈనెల 12న పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు కర్మాగార అధికారితో పాటు సహ చర సిబ్బంది ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ కోసం నమూనాలు ఇచ్చారు. రెండు రోజుల వ్యవధిలో ఫలితా లు వెలువడ్డాయి. కానీ శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఫలితాలు మాత్రం 12రోజులు గడుస్తున్నా వెల్లడించలేదు. ప్రతి రోజు ఆన్‌లైన్‌లో చెక్‌చేసినా శాంపిల్ సెంట్ అని మాత్రమే చూపిస్తోంది. ఫలితాలు వస్తేనే అతను ఉద్యోగానికి వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగా మళ్లీ నమూనాలు ఇవ్వాలన్నా 21రోజుల పాటు కుదరదు.
అంటే ఒకసారి ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి 21 రోజుల అనంతరం మళ్లీ నమూనాలు ఇవ్వాల్సి ఉం టుంది. ఫలితాలు రాలేదు. తిరిగి నమూనాలు ఇచ్చే అవకాశం లేదు. ఆలస్యంగా ఫలితం వచ్చినా అది ఫాల్స్ నెగిటివ్‌గా పరిగ ణించబడుతుంది. అంటే ఆ నమూనాలో పాజిటివ్ ఉన్నప్పటికీ 11 రోజులు వైరస్ బతికే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి పరీక్ష వ్యర్థం. ఇదే తరహా మరో ఘటన సోమవారం పట్టణం లో వెలుగుచూసింది. ఈనెల 15న శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించిన ఓ ఉద్యోగి కరోనా నిర్ధారణ కోసం నమూనాలు ఇచ్చారు. 16న అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తిరుపతి ఐసోలేషన్‌కు తరలించారు.
అతని కుటుంబసభ్యులు ఐదుగురిని పాజిటివ్ కాంటాక్ట్‌గా గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. అతని సమీప బంధువులైన ఇద్దరు సెకండరీ కాంటాక్టుగా 17వ తేదీ నమూనాలు అందజేశారు. 19వ తేదీ సెకండరీ కాంటాక్టు అయిన ఇద్దరు దంపతులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజులు గడుస్తున్నా ప్రైమరీ కాంటాక్టు అయిన ఐదుగురి ఫలితాలు మాత్రం వెలువడలేదు. సెకండరీ కాంటాక్టులకు పాజిటివ్ రావడంతో ప్రైమరీ కాంటాక్టుల్లో ఆందోళన నెలకొంది. ఫలితాల కోసం వారు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. పైగా వారంతా ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉండడంతో చుట్టుపక్కలవారు హడలిపోతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.