వారం క్రితం లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా..

ABN , First Publish Date - 2020-03-25T18:51:14+05:30 IST

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మంగళవారం నమోదయింది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు లండన్‌ నుంచి

వారం క్రితం లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా..

శ్రీకాళహస్తి యువకుడికి కరోనా ‘పాజిటివ్‌’

చిత్తూరు జిల్లాలో మొదటి పాజిటివ్‌ కేసు నమోదు

లండన్‌ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుకు రుయాలో చికిత్స


తిరుపతి(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మంగళవారం నమోదయింది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు లండన్‌ నుంచి ఈనెల 19న చెన్నై చేరుకుని, అక్కడి నుంచి కారులో శ్రీకాళహస్తికి వచ్చాడు. అప్పటినుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటివద్దనే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాడు. 20వ తేదినుంచి ఆయన దగ్గు, జలుబుకు గురికావడంతో 23న రుయా ఆసుపత్రిలోని కరోనా ఐసొలేషన్‌ వార్డుకు వచ్చి శ్వాబ్‌ శాంపిల్స్‌ ఇచ్చాడు. దానిని స్విమ్స్‌లోని వైరాలజీ సెంట్రల్‌ ల్యాబ్‌లో పరీక్షించగా, అతనికి కరోనా సోకినట్టు మంగళవారం నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని రుయా ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు ప్రస్తుతం కుమారుడితో పాటు రుయాలోనే ఉండగా, అతని సోదరిని కూడా పరీక్షల నిమిత్తం మంగళవారం రాత్రి రుయాకు తరలించారు. కాగా, ఆ యువకుడితో పాటు శ్రీకాళహస్తిలోనే మరో వీధికి చెందిన అతని మిత్రుడు కూడా లండన్‌నుంచి కలసి వచ్చాడు. వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసినట్టు తెలియడంతో ప్రస్తుతం ఆ మిత్రుడ్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో పరీక్షిస్తున్నారు. ప్రభుత్వం మొదటి నుంచి హెచ్చరిస్తున్నా, లాక్‌డౌన్లు ప్రకటిస్తున్నా పట్టించుకోని జిల్లా ప్రజానీకం ఇకనైనా ప్రభుత్వ చర్యలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


శ్రీకాళహస్తిలో వైద్యాధికారులు అప్రమత్తం...

జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు శ్రీకాళహస్తిలో నమోదు కావడంతో జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీకాళహస్తిలో ఆ యువకుడు ఉంటున్న ఇంటితో పాటు, ఇంటికి మూడు కిలోమీటర్ల చుట్టుకొలత ప్రాంతంలో హెల్త్‌ సర్వే చేయాలని కలెకర్‌ ఆదేశించారు. ఆ యువకుడు పట్టణానికి వచ్చినప్పటి నుంచి అతని కదలికల వివరాలు సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నివేదిక రూపంలో బుధవారం పంపుతామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఐసొలేషన్‌ వార్డుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

Read more