పెరుగుతూనే ఉన్నాయి

ABN , First Publish Date - 2020-05-13T10:35:11+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 131కి చేరుకుంది. తొలుత ఢిల్లీ

పెరుగుతూనే ఉన్నాయి

జిల్లాలో 131కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

తొలుత మర్కజ్‌... తర్వాత మార్కెట్‌ 

మూలాలతో వైరస్‌ వ్యాప్తి


తిరుపతి, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 131కి చేరుకుంది. తొలుత ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ మూలాలతో జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు ఉవ్వెత్తున వ్యాప్తి చెందగా మలిదశలో కోయంబేడు మార్కెట్‌ మూలాలతో వైరస్‌ విరుచుకుపడింది. 29 మండలాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా అందులో 14 మండలాల్లో కోయంబేడు మూలాలు వెలుగు చూశాయి. అంటే జిల్లాలో కరోనా కేసులు నమోదైన మొత్తం మండలాల్లో సగం మండలాలు కోయంబేడు కారణంగానే కావడం విశేషం. జిల్లాలో తొలి దశలో తిరుపతి, రేణిగుంట, వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, నగరి, నిండ్ర తదితర మండలాల్లో ఢిల్లీ లింకులు కనిపించాయి. 49 కేసులతో శ్రీకాళహస్తి వైరస్‌ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిపోయింది. సుమారు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఓ ఉద్యోగి భార్యాబిడ్డలకు కూడా వైరస్‌ సోకింది. ఢిల్లీ, లండన్‌, చెన్నై మూలాలతో శ్రీకాళహస్తి కేంద్రంగా సుమారు 60 కేసులు నమోదయ్యాయి. అక్కడ కేసులు తగ్గడంతో ఇక జిల్లా కరోనా నుంచీ సురక్షితంగా బయటపడినట్టేనని భావించే సమయంలో కోయంబేడు కొత్త ప్రమాదం తెచ్చిపెట్టింది.  


సమాచారం ఎందుకు దాస్తున్నారు?

జిల్లాలో అధికార యంత్రాంగం కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తొలినుంచీ  గోప్యత పాటిస్తోంది. వాస్తవానికి కరోనా వైరస్‌ గురించి, దాని తీవ్రత గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను హెచ్చరించి వారికి అవగాహన కల్పించడంతో మీడియా పాత్ర కీలకం.  అయితే అధికారులు  కరోనా కేసుల గురించిసరైన సమాచారం ఇవ్వడంలేదు. అనధికారికంగా చెప్పినా, రెండో రోజు రాష్ట్ర బులెటిన్‌తో తేడా వస్తుండడంతో ఎందుకొచ్చిన తంటా అనుకుని మౌనంగా ఉండిపోతున్నారు. ఇందువల్ల జిల్లాలో ఎక్కడైనా పాజిటివ్‌ కేసులు నమోదైతే ఆ విషయం ప్రజానీకానికి సకాలంలో తెలియడం లేదు. కేవలం కేసు నమోదైన హ్యాబిటేషన్‌లో అధికారులు హడావిడి చేయడం తప్పితే ఆ పరిసర ప్రాంత ప్రజానీకాన్ని హెచ్చరించి అప్రమత్తం చేయడం లేదు. ఈ విషయంలో మీడియాను వినియోగించుకోవాల్సిన స్థాయిలో వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందువల్ల అనవసర అనుమానాలు సోషల్‌ మీడియాలో ప్రచారం అయిపోతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం రోజుకు ఒకసారి విడుదల చేసే మీడియా బులెటిన్‌లో జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య తప్పితే కనీసం ఏ మండలంలో ఎన్ని కేసులు, వైరస్‌ సోకింది మహిళకా లేక పురుషునికా, చిన్న పిల్లలకా లేక వృద్ధులకా, మూలాలు ఏమిటి అనే వివరాలేమీ వుండడం లేదు. పాజిటివ్‌ అని నిర్ధారణ అయినా ఆలస్యంగా ప్రకటించడం వల్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఆలోగా మరింత మందిని కలిసి వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యే ప్రమాదం తలెత్తుతోంది. ఎప్పటికప్పుడు మీడియాకు సరైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందనే వాస్తవాన్ని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించాల్సివుంది.


కరోనా సోకిన మండలాలు: 

తిరుపతి, చిత్తూరు నగరాలు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపల్‌ పట్టణాలు, గుడిపాల, వి.కోట, రామకుప్పం, బైరెడ్డిపల్లె, రామసముద్రం, మదనపల్లె, ములకలచెరువు, వాల్మీకిపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం, చంద్రగిరి, తిరుపతి రూరల్‌, రేణిగుంట, వడమాలపేట, ఏర్పేడు, తొట్టంబేడు, బీఎన్‌ కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, విజయపురం, నిండ్ర. 


11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైరస్‌

కుప్పం, పలమనేరు, చిత్తూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో వైరస్‌ వ్యాపించింది. 


వైరస్‌ సోకవి పూతలపట్టు, జీడీనెల్లూరు, పుంగనూరు 

Read more