అమ్మ వెళ్లిపోయింది!

ABN , First Publish Date - 2020-07-22T16:07:44+05:30 IST

అమ్మకోసం తల్లడిల్లిన ఆ కొడుకు..

అమ్మ వెళ్లిపోయింది!

తిరుపతి(ఆంధ్రజ్యోతి): అమ్మకోసం తల్లడిల్లిన ఆ కొడుకు ఓడిపోయాడు. వైరస్‌తో పోరాడి అమ్మా.. వైరస్‌ కన్నా దారుణంగా మారిన వ్యవస్థతో పోరాడి అతనూ ఓడిపోయారు. నడుచుకుంటూ అంబులెన్స్‌ ఎక్కిన అమ్మ మూడో రోజుకే జిప్‌ సంచిలో శవమై కనిపించడంతో కుప్పకూలిపోయాడు. పాజిటివ్‌ అని తేలి, ఆయాసంతో అవస్థపడుతున్న ఆమ్మను ఆస్పత్రికి చేర్చడానికి తిరుపతిలోని మంగళం క్వార్టర్స్‌లో వుంటోన్న ఢిల్లీబాబు పడ్డ తపనను ‘ఈ పాపం ఎవరిది?’ అంటూ శనివారం నాడు ఆంధ్రజ్యోతి వార్తగా ప్రచురించింది. ఢిల్లీబాబు పోరాటంతో 70 ఏళ్ళ అమ్మను ఆస్పత్రికి తరలించారు.


ఆస్పత్రి బెడ్‌మీద నుంచి కూడా ఆమె శనివారం ఉదయం ఫోన్‌లో కొడుకుతో మాట్లాడింది. తనను పట్టించుకోవడం లేదని, వైద్యం అందడంలేదని చెప్పింది. టిఫిన్‌ తెచ్చి దూరంగా పెట్టేసి వెళ్ళారనీ, ముక్కుకు ఉన్న ఆక్సిజన్‌ తీసేసి వెళ్ళి తినాలో లేదో కూడా తెలియడం లేదని బాధపడింది. ఆ తర్వాత ఆమె చేతికి ఇచ్చి వచ్చిన ఫోన్‌ పలకలేదు. అమ్మతో ఒక్క పూట కూడా మాట్లాడకుండా ఉండలేని కొడుకు తల్లడిల్లిపోయాడు. ఆస్పత్రి చుట్టూ తిరిగాడు. నిబంధనలు అనుమతించవు. అతని ఆందోళన చూసి అక్కడి సిబ్బంది, తామే ఫోన్‌ చేసి ఎప్పటికప్పుడు ఆమె సమాచారం చెబుతామని సమాధానపరిచి ఇంటికి పంపేశారు. ఆదివారం అంతా ఏ సమాచారం తెలియలేదు. సోమవారం సాయంత్రం దాకా చూసి  పద్మావతి కోవిడ్‌ ఆస్పత్రికి చేరుకున్నాడు. సిబ్బందిని ప్రాధేయపడితే, ఆమె బాగానే ఉందని చెప్పి పంపేశారు. స్థిమితపడి ఇంటికి చేరుకున్నాడు.


మంగళవారం ఉదయం 10గంటలకు స్విమ్స్‌ మార్చురీ సిబ్బంది నుంచీ ఫోన్‌ కాల్‌ వచ్చింది. 20వ తేదీ రాత్రి అతడి తల్లి మరణించిందని, శవం మార్చురీలో వుందని చెప్పారు. వెంటనే రాకపోతే అనాధ శవం తరహాలో తామే దహనం చేయాల్సి వస్తుందనీ చెప్పారు. ఏడుస్తూ ఆస్పత్రికి చేరుకున్న ఢిల్లీబాబు సిబ్బంది ఇచ్చిన డెత్‌ కామెంటరీ కాగితం చూసి షాక్‌ తిన్నాడు. అందులో అతడి తల్లి 20వ తేదీ ఉదయం 11 గంటలకు మృతిచెందినట్టు ఉంది. 20న ఉదయం 11 గంటలకే చనిపోతే అదేరోజు సాయంత్రం తాను వెళ్ళినపుడు తన తల్లి ఆరోగ్యం బాగానే వుందని సిబ్బంది ఎలా చెప్పారని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. తల్లి చనిపోయిన 23 గంటల వరకూ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని  కన్నీరుమున్నీరవుతూ ప్రశ్నిస్తున్నాడు. 


ఈ పాపం అధికార యంత్రాంగానిదేనా?

ఓ పాజిటివ్‌ వ్యక్తికి ప్రైమరీ కాంటాక్టుగా వున్న ఢిల్లీబాబు గత నెల 29న కరోనా టెస్టు కోసం శాంపిల్‌ ఇచ్చారు. అదే రోజు అతన్ని వికృతమాల క్వారంటైన్‌ సెంటరుకు తరలించారు. ఆ టెస్టు ఫలితం ఎంతకీ రాలేదు. ఈ నెల 7న శాంపిల్‌ రిజెక్టెడ్‌ అంటూ సమాచారమిచ్చారు. దాంతో 8న మరోసారి శాంపిల్‌ ఇచ్చాడు.  ఆ రిపోర్టు కూడా రాలేదు. అయినా 11న డిశ్చార్జి చేశారు. తనకు వైరస్‌ సోకిందో లేదో తెలియని అయోమయ స్థితిలో భయపడుతూనే ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో 70 ఏళ్ళ వృద్ధ తల్లి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. అతను భయపడినట్టే 13వ తేదీ రాత్రి నుంచీ తల్లికి జ్వరం, ఆయాసం మొదలైంది.


14న ఆమెతో పాటు మరోసారి ఢిల్లీబాబు శాంపిల్‌ ఇచ్చాడు. తల్లి పాజిటివ్‌ అంటూ 17న రిపోర్టు వచ్చింది. ఢిల్లీబాబు రిపోర్టు మాత్రం రాలేదు. అయినా తల్లికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆమె ప్రైమరీ కాంటాక్టులుగా ఢిల్లీబాబు, అతని భార్య, ఇద్దరు కొడుకులు కరోనా టెస్టుల కోసం 18న రోజంతా మెటర్నిటీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసినా శాంపిల్స్‌ తీసుకోలేదు. 19వ తేదీన తీసుకున్నారు. వాటి ఫలితాలు ఇంకా రానేలేదు. ఈలోగానే అతడి తల్లి కన్నుమూసింది. జిల్లాలో కొవిడ్‌ పరీక్షల్లో జరుగుతున్న నిర్లక్ష్యానికి ఈ ఉదంతమే ఓ పెద్ద ఉదాహరణ.

Updated Date - 2020-07-22T16:07:44+05:30 IST