ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తికి సోకకుండా కుటుంబీకులకు ఎలా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2020-04-14T10:23:26+05:30 IST

శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం..

ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తికి సోకకుండా కుటుంబీకులకు ఎలా అని ఆరా తీస్తే..

మరో ఇద్దరికి కరోనా

ముక్కంటి క్షేత్రంలో ఐదుకు చేరిన కేసులు

జిల్లాలో 23కు పెరిగిన బాధితుల సంఖ్య

13 రోజుల్లో 22 కేసులతో అధికారుల్లో ఆందోళన

తాజా కేసులకు కారణం నిబంధనల ఉల్లంఘనే?


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఢిల్లీలో జమాత్‌కు వెళ్లొచ్చిన బృందంలో ఓ వ్యక్తి భార్యకు, కుమార్తెకు వైరస్‌ సోకింది. వీరిలో ఒకరు తొమ్మిదేళ్ళ చిన్నారి. ఈ కేసులతో ముక్కంటి క్షేత్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు పెరగగా జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. వీటిలో 16 కేసులకు ఢిల్లీ మూలాలున్నాయి. వాటిలో తాజా కేసులు రెండూ కూడా వున్నాయి.


శ్రీకాళహస్తి పట్టణంతో పాటు ఏర్పేడుకు చెందిన మొత్తం 21 మంది ముస్లింలు గత నెల 13వ తేదీన బయల్దేరి 14న రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. 15, 16 తేదీల్లో అక్కడే నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గడిపారు. వారిలో ఆరుగురు అక్కడే నిలిచిపోగా 15 మంది 17వ తేదీన ఢిల్లీ నుంచి బయల్దేరి 19వ తేదీ తెల్లవారుఝామున శ్రీకాళహస్తి చేరుకున్నారు. గత నెలాఖరు వరకూ రోజువారీ కార్యకలాపాల్లో గడిపారు. నెలాఖరున అధికారులు గుర్తించి ఈ 15 మందినీ, వారి కుటుంబీకులు, వారు కలసిన పలువురు ఇతరులను గుర్తించి మొత్తం 70 మందిని క్వారంటైన్‌కు తరలించారు.


తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన 15 మందిలో తొలి విడత ఇద్దరికి, మలి విడత ఒకరికి చొప్పున మొత్తం ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. తాజాగా ఈ నెల 11వ తేదీన బృందంలోని మరో వ్యక్తికి, అతని కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా సోమవారం ఫలితాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి నెగెటివ్‌ రాగా అతని భార్య (30)కు, కుమార్తె (9)కు పాజిటివ్‌ అని తేలింది. దీంతో తికమకపడిన అధికారులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి అతడితో పాటు అతని మరో ఇద్దరు కుమార్తెలకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు.


ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి సోకకుండా కుటుంబీకులకు ఎలా? 

జిల్లాలో ఇప్పటి వరకూ వెలుగు చూసిన 23 కరోనా కేసుల్లో 16 కేసులకు ఢిల్లీ మూలాలు వున్నాయని అధికారులు గుర్తించారు. ఏడుగురు నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్ళివచ్చిన వారు కాగా, మరో ఇద్దరు అక్కడ ఉద్యోగులు. ఈ తొమ్మిదిమందికి తొలుత వైరస్‌ సోకగా వీరిలో తిరుపతికి చెందిన వ్యక్తి ద్వారా అతడి తల్లిదండ్రులకు సోకింది. రేణిగుంటలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ద్వారా అతడి సోదరికి సోకింది. నగరిలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నుంచి అతని కుటుంబంలో మరో ఇద్దరు మహిళలకు సోకింది. అయితే శ్రీకాళహస్తిలో సోమవారం నమోదైన రెండు కేసుల్లో వారికి ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనేది తొలుత అధికారులను తికమకపెట్టింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తికి సోకకుండా అతని కుటుంబీకులకు వైరస్‌ ఎలా సంక్రమిస్తుందనేది పజిల్‌గా మారింది.


అయితే అధికారులు ఆరా తీస్తే శ్రీకాళహస్తి క్వారంటైన్‌ కేంద్రంలోని కరోనా అనుమానితుల్లో అత్యధికులు నిబంధనలను ఏమాత్రం పాటించలేదని తెలిసింది. వేర్వేరు గదుల్లో వుండేందుకు తిరస్కరించడం, కుటుంబమంతా కలిసి ఒకే గదిలో వుండడం, తరచూ గదులు విడిచి ఇతర గదుల్లోని వారితో గుంపులుగా కూర్చుని గడపడం, కలసి భోంచేయడం, కనీసం మాస్కులు వంటివి కూడా ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినట్టు తెలిసింది. అధికారుల సూచనలను, అభ్యర్థనలను ఖాతరు చేయలేదని సమాచారం. క్వారంటైన్‌ కేంద్రంలో ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబీకులు పలువురు వుండడంతో వారిలో ఎవరి నుంచైనా ఈ మహిళకు, ఆమె కుమార్తెకు సోకి వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ పరిణామాలతో క్వారంటైన్‌ కేంద్రంలో వున్నవారిలో వైరస్‌ సోకినవారు మరికొందరు వుంటారని అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం శ్రీకాళహస్తి క్వారంటైన్‌ కేంద్రం మూసివేసింది. అక్కడ వున్న 39 మంది అనుమానితులందరినీ వరదయ్యపాళెం మండలంలోని కల్కి ఆశ్రమంలో సిద్ధం చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించింది.

Updated Date - 2020-04-14T10:23:26+05:30 IST