కరోనా కష్టకాలంలో తిరుపతిలో ఇదేంటి.. ఎందుకిలా!?

ABN , First Publish Date - 2020-04-26T16:32:00+05:30 IST

అసలే కరోనా కష్టకాలం. ఆరు పదుల వయసు దాటినా మొక్కవోని దీక్షతో పరుగులు తీస్తున్న అధికారి.

కరోనా కష్టకాలంలో తిరుపతిలో ఇదేంటి.. ఎందుకిలా!?

  • రుయా సూపరింటెండెంట్‌పై వేటు 
  • ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగింత
  • డీఎంఈ నుంచి కాకుండా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు

తిరుపతి : అసలే కరోనా కష్టకాలం. ఆరు పదుల వయసు దాటినా మొక్కవోని దీక్షతో పరుగులు తీస్తున్న అధికారి. ఇప్పుడిప్పుడే తిరుపతిలోని రుయా ఆస్పత్రిని గాడిలో పెడుతున్నారు. అన్నిరకాల వనరులను సమకూర్చుకుంటూ అహరహం కృషిచేస్తూ అన్ని వర్గాల నుంచి అభినందనలు అందు కుంటున్న ఈ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్వీ రమణయ్యను ప్రభుత్వం అకస్మాత్తుగా బాధ్యతలనుంచి తప్పించింది. శనివారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఈ-మెయిల్‌ ద్వారా డాక్టర్‌ రమణయ్యను తప్పిస్తూ, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతికి రుయా అడిషనల్‌ చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు పంపారు. దాంతో రమణయ్య ఇకపై రుయా జనరల్‌ సర్జరీ హెచ్‌వోడీగా కొనసాగనున్నారు. 


పూర్తి భిన్నంగా.. 

సూపరింటెండెంట్‌ స్థాయి అధికారుల స్థానచలనాలపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) నుంచి ఉత్తర్వులు వస్తాయి. డీఎంఈ నుంచే కాపీటూ ప్రిన్సిపల్‌ సెక్రటరీతోపాటు ఇతరులకు వెళుతుంది. ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులిస్తూ కాపీ టూ డీఎంఈ ఉంది. రుయా సూపరింటెండెంట్‌ (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్జి)గా 2019 నవంబరు 15వ తేదీన ఎన్వీ రమణయ్య బాధ్యతలు చేపట్టారు. రుయాకు అవసరమైన వాటిని యుద్ధ ప్రాతిపదికన అటు అధికారులను ఒప్పించి తెప్పించుకుంటూ.. ఇటు దాతల ద్వారా సమకూరుస్తూ వచ్చారు. శనివారం కూడా వైద్యసిబ్బందికి అవసరమైన శానిటేషన్‌ మెషిన్‌ను దాతల నుంచి తెప్పించుకున్నారు. సహచర వైద్యులను సమన్వయం చేసుకుంటూ.. నర్సింగ్‌, పారా మెడికల్‌, మినిస్టీరియల్‌ స్టాఫ్‌కు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. 


కరోనా మహమ్మారికి ఎదురొడ్డి నిలబడి.. అనారోగ్యంలోనూ సెలైన్‌ పెట్టుకుని విధులకు హాజరై వైద్య సిబ్బందిలో స్ఫూర్తిని నింపారు. ఇలాంటి సమయంలో అంకితభావంతో పనిచేసే అధికారిని తొలగించడంపై వైద్య సిబ్బందిలో పోరాట స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది. నడియుద్ధంలో తొలి వరుసలో ఉన్న సైనికుడిని వెనక్కి పంపినట్టుగా ఈ నిర్ణయం ఉందని పలువురు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-26T16:32:00+05:30 IST