పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకరంగా.. తిరుపతి, శ్రీకాళహస్తిలో పరిస్థితి ఇదీ..!

ABN , First Publish Date - 2020-06-22T17:25:51+05:30 IST

జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. తిరుపతి విషయానికొస్తే ఆదివారం

పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకరంగా.. తిరుపతి, శ్రీకాళహస్తిలో పరిస్థితి ఇదీ..!

తిరుపతిలో 183, శ్రీకాళహస్తిలో 130 కేసులు 

కరోనాతో వృద్ధుడి మృతి 

జిల్లాలో కొత్తగా 32 మందికి పాజిటివ్‌ 

పుత్తూరులో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్‌ 

ఏర్పేడులో ఇద్దరు రిమాండు ఖైదీలకు కరోనా 

జిల్లాలో 866కు చేరిన కేసులు 


తిరుపతి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. తిరుపతి విషయానికొస్తే ఆదివారం నగరంలో 12, రూరల్‌ మండలంలో 2 చొప్పున 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తిరుపతి నగరంలో 146, రూరల్‌లో 37 చొప్పున మొత్తం 183 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130కి చేరుకుంది. తిరుపతి, శ్రీకాళహస్తిలలో నమోదైన కేసులు ఆయా పట్టణాల స్థాయి దృష్ట్యా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యధికంగానే పరిగణించాలి. ఈ పుణ్యక్షేత్రాలతో పాటు పలు ఇతర పట్టణాలు, మండలాల్లోనూ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. పుత్తూరులో కూడా తాజాగా ఆరు కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి అక్కడ నమోదైన కేసుల సంఖ్య 71కి చేరింది. చిత్తూరులో కూడా ఆదివారం నాలుగు కేసులను గుర్తించగా వాటితో కలిపి అక్కడ కేసుల సంఖ్య 57కు చేరాయి. నగరిలో ఆదివారం కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో ఇక్కడ కేసుల సంఖ్య 25కి పెరిగింది. రేణిగుంట మండలంలోనూ రెండు కేసుల్ని గుర్తించడంతో 25కు చేరుకుంది.


నాగలాపురంలో 40, సత్యవేడులో 37, పిచ్చాటూరులో 26, నిండ్రలో 24, వి.కోటలో 20, కేవీబీపురంలో 19, కార్వేటినగరంలో 18, వరదయ్యపాలెంలో 17, చంద్రగిరిలో 16, మదనపల్లెలో 14, విజయపురం, ఏర్పేడుల్లో పది చొప్పున... ఇలా పలు మండలాల్లో కేసుల సంఖ్య రెండంకెల్లో ఉన్నాయి. జిల్లాలో వైరస్‌ ఉనికి వెలుగు చూస్తున్న మండలాల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. మొత్తం 66 మండలాలకు గానూ ఇప్పటి వరకూ 57 మండలాల్లో వైరస్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచీ వస్తున్న వారిలో క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించిన వారికి, కరోనా లక్షణాలతో స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకొస్తున్న వారికే కొవిడ్‌ పరీక్ష లు నిర్వహిస్తున్నారు. పరిమిత సంఖ్యలో టెస్టులు నిర్వహి స్తుంటేనే జిల్లాలో ఈ స్థాయిలో కేసులు నమోదవు తుంటే..విరివిగా చేస్తే మరెన్ని వెలుగు చూస్తాయో నన్న ఆందోళన అటు ప్రజానీకంతో పాటు ఇటు యంత్రాంగాన్నీ స్థిమితంగా ఉండనివ్వడంలేదు. 


తాజాగా 32 కేసులు నమోదు 

జిల్లాలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో 12, రూరల్‌లో 2, పుత్తూరులో 6, చిత్తూరు, నగరిలో నాలుగు చొప్పున, రేణిగుంట, శ్రీకాళహస్తిలలో రెండు చొప్పున కేసులున్నాయి. పుత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి 17, 15 ఏళ్ల కుమారులిద్దరికీ వైరస్‌ సోకింది. శ్రీకాళహస్తిలో ఇద్దరు రిమాండు ఖైదీలకు పాజిటివ్‌ తేలింది. దీంతో జైలుకు పంపాల్సిన వారిని తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.


రేణిగుంట మండలం గాజులమండ్యంలో 15 ఏళ్ల బాలుడికి వైరస్‌ సోకింది. జిల్లా యంత్రాంగం ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించిన వివరాల మేరకు కొత్తగా నిర్ధారించిన 32 కేసులతో కలిపి ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 866కు చేరుకుంది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం విజయపురం, సత్యవేడు, శ్రీరంగరాజపురం తదితర మండలాల్లో కూడా ఆదివారం పలు కేసులు వెలుగు చూశాయి. వీటి సమాచారం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, ఆదివారం స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనాతో వృద్ధుడు మృతిచెందారు. 

Updated Date - 2020-06-22T17:25:51+05:30 IST