పడగ విప్పిన కరోనా

ABN , First Publish Date - 2020-04-21T08:25:59+05:30 IST

దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంపై కరోనా పడగ విప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా...

పడగ విప్పిన కరోనా

  • మరో 13 మందికి పాజిటివ్‌
  • శ్రీకాళహసిౖ పట్టణంలో 34కు చేరిన కోవిడ్‌-19 కేసులు
  • భయం గుప్పిట్లో ముక్కంటి క్షేత్రం
  • కొనసాగుతున్న వందలాది రాపిడ్‌ టెస్ట్‌లు
  • పాజిటివ్‌లు ఇంకా పెరగవచ్చని ఆందోళన


శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 20: దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంపై కరోనా పడగ విప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా... ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలో మాత్రమే 24 కేసులు ఉండటం  తీవ్రతను తెలియజేస్తోంది. వాస్తవానికి ఆదివారం 11 పాజిటివ్‌ కేసులను జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం ప్రకటించలేదు. మరో 13 పాజిటివ్‌ కేసులను కలిపి మొత్తంగా 24 కేసులను రాష్ట్ర అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. తాజా పాజిటివ్‌లతో కలిపితే శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా సోకినవారి సంఖ్య 34కు చేరింది. దీంతో పెద్ద సంఖ్యలో అనుమానితులను క్వారెంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. స్వాప్‌ సేకరించి పరీక్షకు పంపుతున్నారు. వందలాది మందికి చేసిన టెస్ట్‌ల రిపోర్టులు ఇంకా రావలసి ఉంది. ఇవి వస్తే సంఖ్య మరింత పెరిగే ప్రమాదరం ఉందని భావిస్తున్నారు. దీంతో   ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కలవరపడుతున్నారు. వీరికి పెద్ద సంఖ్యలో రాపిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణం కరోనాకు కేంద్రంగా మారుతోన్న తీరు జిల్లా ప్రజలను ఆందోళన పరుస్తోంది.  జిల్లాలో మొట్టమొదటి  పాజిటివ్‌ కేసు మార్చి 24న శ్రీకాళహస్తిలోనే నమోదైంది. లండన్‌ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఆ యువకుడు తర్వాత వైరస్‌ను గెలిచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునేలోగా  ఢిల్లీకి మత ప్రార్ధనలకు వెళ్లి తిరిగివచ్చిన వారితో పాజిటివ్‌లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా సోమవారం నమోదైన 13 పాజటివ్‌ కేసుల్లో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఉన్నారు. మిగిలిన వారు శ్రీకాళహస్తి పట్టణంలోని పీవీరోడ్డు, నగార్చిపాళెం. ముత్యాలమ్మగుడివీధి, గోపాలవనం, జయరామరావువీఽధి ప్రాంతాలకు చెందిన వారు. ఆదివారం పాజిటివ్‌గా తేలిన 11మందిలో ఏడుగురు రెవెన్యూ ఉద్యోగులు, ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఒక మహిళా ఎస్‌ఐ ఉండడం కరోనా నిరోధ సేవల్లో ఉన్న సిబ్బందిని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.  శ్రీకాళహస్తి రెవెన్యూ సిబ్బందిని స్వచ్చంధంగా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనాబేగం కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లడంతో ఆ బాధ్యతలను బుచ్చినాయుడుకండ్రిగ తహసీల్దారు గణేష్‌కు అప్పగించారు.


క్వారంటైన్‌ కేంద్రంలో ఆకలి కేకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని క్వారంటైన్‌ కేంద్రంలో సోమవారం పలువురు ఆకలితో అలమటించారు. రెవెన్యూ, వార్డు సచివాలయాలకు చెందిన కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో... మిగిలిన సిబ్బంది అందరినీ ఆదివారం రాత్రి నుంచి పట్టణంలోని భక్తకన్నప్పసదన్‌లో ఉంచారు. ఇందులో రెవెన్యూ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వార్డు వలంటీర్లు కూడా ఉన్నారు. ఇక్కడ సరెన వసతులు కల్పించలేదు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వలేదు. సోమవారం మొత్తం వారు పస్తులతో ఉండాల్సి వచ్చింది. అధికారులకు చెబితే ఏమంటారో అనే భయంతో చాలా మంది ఉండిపోయారు. కొందరు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా, ముక్కంటి ఆలయం వద్దకు వెళ్లి తినండని చెప్పారని సిబ్బంది కొందరు ఆవేదనతో తమ కుటుంబ సభ్యులకు తెలియపరిచారు.  


లింకులు చేధించేదెలా..?

శ్రీకాళహస్తి అర్బన్‌, ఏప్రిల్‌ 20: శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా మహమ్మారి  విస్తరిస్తున్న తీరు అందరినీ కలవరపరుస్తోంది. ఎవరి నుంచి ఎవరికి సోకుతోందో అంతుచిక్కని దశకు చేరువవుతోంది. ఇటీవల నమోదైన కొన్నికేసులు ఇందుకు ఉదాహరణ. ప్రైవేటు వైద్యశాలలోని మెడికల్‌ షాప్‌ నిర్వాహకులైన ఇద్దరు అన్నదమ్ములకు పాజిటివ్‌గా నమోదైంది. క్వారంటైన్‌లో లేకుండా ఇంటి వద్ద ఉన్న మరికొందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే విధుల్లో ఉన్న పలుశాఖల ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు కూడా సోకినట్లు ఇప్పటికే వెల్లడైంది. మూడు రోజుల ముందు వరకు ఢిల్లీ ఘటనతో సంబంధం ఉన్న వారు మాత్రమే పాజిటివ్‌గా  నమోదయ్యాయి. అయితే తాజా కేసుల తీరును బట్టీ చాపకిందనీరులా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అర్థమవుతోంది. స్వచ్ఛందంగా పరీక్షలకు హాజరైన ఉద్యోగులకు పాజిటివ్‌ రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు శ్రీకాళహస్తి పట్టణం మినహా సమీప గ్రామాలకు వైరస్‌ వ్యాప్తి చెందలేదని అందరూ భావిస్తున్నారు. కానీ వస్తున్న పాజిటివ్‌ల తీరు చూశాక గ్రామాలకు కూడా విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ఉదాహరణకు కొత్తపేటలోని మందుల దుకాణానికి రోజు పట్టణం నుంచే కాకుండా పరిసర వందలాది గ్రామాల నుంచి రోగులు వచ్చిపోతుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా రోగుల సంఖ్య కొంత తగ్గివుండవచ్చు. వీరంతా ఎవరు? ఏయే ఊళ్ళ వాళ్ళు?  అని  గుర్తించడం సవాల్‌గా  మారింది. అలాగే పట్టణంలో ఇటీవల దాతలు పెద్దఎత్తున అన్నదానాలు, వితరణలు నిర్వహించారు. వీటిల్లో భౌతికదూరం బలాదూర్‌ అయింది.


జనం గుంపులుగా వచ్చి సాయం అందుకున్నారు. ఈ ఆహార పదార్థాలు వండినది ఎవరు? వారిలో ఎవరైనా పాజిటివ్‌లతో కాంటాక్ట్‌లోకి వెళ్ళి ఉండే అవకాశం ఉందా అనేది తెలియడం లేదు. ఇక అధికారులు, ఉద్యోగులు లాక్‌డౌన్‌ విధుల్లో భాగంగా ఎక్కువగా ఫీల్డ్‌పైన గడపాల్సి వచ్చింది. దీంతో ఆహార పదార్థాల కోసం వీరు కూడా పలువురి దాతలపై ఆధారపడ్డారు. ఇది ఎంత సురక్షితమో అంతుపట్టడం లేదు. ఇక పట్టణ వ్యాప్తంగా నిర్దేశిత సమయంలో వ్యాపారులు పెద్దఎత్తున దుకాణాలు నిర్వహించారు. జనం ఎగబడి కొనుగోళ్ళు చేశారు. ఎక్కడా తగిన జాగ్రత్తలు పాటించిన దాఖలాలు లేవు. ఈ సమూహాల్లో వైరస్‌ ఒంట్లో ఉన్నవారు ఉండిఉంటే అది ఏ స్థాయిలో విస్తరించి ఉంటుందో అనే ఆందోళన అందరిలో ఉంది. మొత్తంమీద లింకులను చేధించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 


Updated Date - 2020-04-21T08:25:59+05:30 IST