ఇద్దరు బాలింతలకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-10T18:56:27+05:30 IST
ఇద్దరు బాలింతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సత్యవేడు మండలంలోని కన్నవరం గ్రామానికి చెందిన ఓ మహిళ(23) లాక్డౌన్కు ముందు నిండ్ర మండలం కావనూరులోని పుట్టింటికి వెళ్లింది

సత్యవేడు/గుర్రంకొండ(చిత్తూరు): ఇద్దరు బాలింతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సత్యవేడు మండలంలోని కన్నవరం గ్రామానికి చెందిన ఓ మహిళ(23) లాక్డౌన్కు ముందు నిండ్ర మండలం కావనూరులోని పుట్టింటికి వెళ్లింది. గర్భిణులకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ నెల ఒకటవ తేదీన నగరి ఏరియా ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షలు చేయించుకుంది. వారం రోజుల క్రితం తిరిగి అత్త గారింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, ఆస్పత్రిలో కాన్పయింది. అయితే గురువారం ఉదయం ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడవడంతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనలో పడ్డారు. ఆమెను వెంటనే తిరుపతి ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం ఎల్లుట్లకు చెందిన ఓ మహిళకు 10 రోజుల క్రితం తిరుపతిలో కాన్పయ్యింది. ఆ తర్వాత కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఆమెను కొవిడ్ ఆస్పత్రికి తరలించారు.