వెయ్యి దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-25T11:28:14+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. తాజాగా బుధవారం 45 కేసులను గుర్తించడంతో 60 మండలాల్లో 1036 కేసులు

వెయ్యి దాటిన కరోనా కేసులు

తాజాగా 45 పాజిటివ్‌ల గుర్తింపు

చెరివి గ్రామంలోనే 20మందికి వైరస్‌

60 మండలాల్లో 1036 కేసుల నమోదు

878 కేసులు 20 మండలాల్లోనే గుర్తింపు


తిరుపతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. తాజాగా బుధవారం 45 కేసులను గుర్తించడంతో 60 మండలాల్లో 1036 కేసులు నమోదైనట్టయింది. వాస్తవానికి మంగళవారం నాటికే జిల్లాలో 1002 కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో పది కేసులు ఇతర జిల్లాలకు, ఒక కేసు వేరే రాష్ట్రానికి సంబంధించినవి కాగా 991 కేసులు జిల్లాకు సంబంధించినవి. బుధవారం కూడా రాత్రి వరకూ 46 కేసులు నమోదు కాగా అందులో జిల్లావి 45. ఒక కేసు వేరే జిల్లాకు సంబంధించింది. తాజా కేసుల విషయానికొస్తే సత్యవేడు మండలం చెరివి గ్రామంలోనే 20 కేసులు నమోదయ్యాయి.


శ్రీసిటీ పరిధిలోని ఓ ఫార్మా కంపెనీలో బాధితులందరూ పనిచేస్తున్నారు. మిగిలిన వాటిలో చిత్తూరులో 6 కేసుల్ని గుర్తించగా పిచ్చాటూరులో 5, తిరుపతి రూరల్‌ మండలంలో 4, తిరుపతి అర్బన్‌లో 3, బైరెడ్డిపల్లె, పెద్దమండ్యం, ములకలచెరువు, శ్రీకాళహస్తి, రేణిగుంట, నగరి, నారాయణవనం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో అత్యధికం తిరుపతిలోనివే. ఇప్పటివరకూ నగరంలో 166, రూరల్‌ మండలంలో 62 చొప్పున తిరుపతిలోనే మొత్తం 228 కేసులు వెలుగు చూశాయి. ఇక శ్రీకాళహస్తిలో 132 కేసుల్ని గుర్తించగా చిత్తూరులో 82, పుత్తూరులో 77, సత్యవేడులో 57, నాగలాపురంలో 41,  రేణిగుంటలో 35 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం 1036 కేసులకు గానూ 878 కేసులు కేవలం 20 మండలాల్లోనే నమోదు కావడం గమనార్హం.

Updated Date - 2020-06-25T11:28:14+05:30 IST