నిరసనల హోరు.. కొనసాగిన టీడీపీ, బీజేపీ ఆందోళనలు

ABN , First Publish Date - 2020-09-25T16:40:55+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలోకి డిక్లరేషన్‌ ఇవ్వకుండానే సీఎం జగన్‌ ప్రవేశించడం పట్ల..

నిరసనల హోరు.. కొనసాగిన టీడీపీ, బీజేపీ ఆందోళనలు

తిరుమల అపవిత్రమైందంటూ టీడీపీ నేతల పరిహార పూజలు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోకి డిక్లరేషన్‌ ఇవ్వకుండానే సీఎం జగన్‌ ప్రవేశించడం పట్ల వరుసగా రెండవ రోజు కూడా జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. అగ్నిలో ఆజ్యం పోసిన చందంగా మంత్రి కొడాలి నానీ ఏకంగా ప్రధాని మోదీని కూడా అందులోకి లాగడంతో బీజేపీ శ్రేణులు మరింత మండిపడ్డాయి. నానీ వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.  సీఎం జగన్‌ డిక్లరేషన్‌ సమర్పించ కుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడంతో తిరుమల అపవిత్రమైందంటూ టీడీపీ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల పరిహార పూజలు నిర్వహించారు.


తిరుపతి నగరం కొత్తవీధిలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తెలుగు మహిళ నాయకురాళ్లు బ్యాంకు శాంతమ్మ, సింధుజ నేతృత్వంలో మహిళలు ప్రత్యేక పరిహార పూజలు జరిపారు. పుంగనూరు సాయిబాబా ఆలయంలో  టీడీపీ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి ఆధ్వర్యంలో పరిహార పూజలు నిర్వహించారు. చిత్తూరులో టీడీపీ ముఖ్యనేతలు వైవీ రాజేశ్వరి, వి.సురేంద్రకుమార్‌ తమతమ నివాసాల్లో పాప పరిహార పూజలు చేయించారు. 


నానీ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు

మంత్రి కొడాలి నాని బుధవారం తిరుమలలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ తదితరులపై చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు మండిపడ్డాయి. నానీని మంత్రి పదవి నుంచీ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి ధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌,శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బరితెగించి మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానీని రోడ్లపై చెప్పులతో కొడతామంటూ హెచ్చరించారు.


అసలు తనది ఏ మతమో కొడాలి తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారి ఆలయంలోకి సీఎం వెళ్ళడంపై ఆలయ ఆచారం మంటగలిపారని ఆరోపిస్తూ ఆయన ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. నానీని వెంటనే మంత్రి పదవి నుంచీ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ, జనసేన శ్రేణులు దేవుళ్ళ వేషాలు ధరించి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించాయి. తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దారు జరీనాబేగంకు వినతిపత్రం సమర్పించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొడాలినానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. రాజంపేట పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుండగా పోలీసులు ధర్నా విరమించాలని  సూచించారు. బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో బలవంతంగా ధర్నాను విరమింపజేయించారు.


తిరుపతిలో రెండో రోజూ నేతల నిర్బంధం

తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతల  గృహనిర్బంధాలు రెండోరోజైన గురువారం కూడా కొనసాగాయి. సీఎం జగన్‌ తిరుమల నుంచి తిరుగు ప్రయాణమైన తర్వాతనే వారిని గృహ నిర్బంధం నుంచీ విడిచిపెట్టారు.టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, దంపూరి భాస్కర్‌ యాదవ్‌, రవినాయుడుతో పాటు బీజేపీ నేతలు భానుప్రకాష్‌ రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, శాంతారెడ్డి ఇళ్ళపై పోలీసులు నిఘాపెట్టారు. సుగుణమ్మ నివాసం ముందు పోలీసులను కాపలా వుంచారు. కుటుంబసభ్యులు వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లాల్సివచ్చినా పోలీసులు అనుసరించారు. Updated Date - 2020-09-25T16:40:55+05:30 IST