కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2020-12-05T06:55:57+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం పట్టణ, మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ భరత్‌గుప్తా ఆదేశించారు.

కలెక్టర్ భరత్‌గుప్తా ఆదేశం
చిత్తూరు(సెంట్రల్), డిసెంబరు 4: జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం పట్టణ, మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ భరత్‌గుప్తా ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి పలుశాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భరత్‌గుప్తా మాట్లాడుతూ పట్టణస్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, మండలస్థాయిలో తహసీల్దార్లు ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు రెవెన్యూ, మండల పరిషత్, వైద్య, పోలీసు, విద్యుత్తు, రవాణా, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. పట్టణ, మండలస్థాయిలో కొవిడ్ ఫ్రంట్‌లైన్, హెల్త్‌వర్కర్ల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన వ్యాక్సిన్‌ను నిల్వ చేసుకునేలా కోల్డ్‌చైన్, డీప్ ఫ్రిడ్జ్‌లు తదితర పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆయన గుర్తుచేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం, డీఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.