పట్టణ ప్రాంతాల్లోనే అధిక కేసులు

ABN , First Publish Date - 2020-07-10T10:38:17+05:30 IST

పట్టణ ప్రాంతాల్లోనే కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు.

పట్టణ ప్రాంతాల్లోనే అధిక కేసులు

 మున్సిపల్‌ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్‌ 


తిరుపతి, జూలై9 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లోనే కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్‌ కమిషనర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి గురువారం ఆయన జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసా రెడ్డితో కలసి మున్సిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ బాధితులను హోమ్‌ ఐసోలేషన్‌ లేదా తిరుపతి శ్రీనివాసం కొవిడ్‌ సెంటరుకు పంపాలన్నారు.


రవాణా సౌకర్యం కోసం జేసీ చంద్రమౌళిని సంప్రదించాలన్నారు. ప్రతి మున్సిపాల్టీ నుంచి ఒక అధికారి శ్రీనివాసం కోవిడ్‌ కేంద్రంలో విధులు నిర్వహించేలా చూడాలన్నారు. అప్పుడే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే కేసుల అడ్మిషన్‌ సులభతరంగా ఉంటుందన్నారు. కేసుల నమోదు ప్రాంతంలో 200 మీటర్లు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి శానిటేషన్‌ చేయాలన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌కు అంగీకరించిన వారితో డాక్టర్లు ప్రతిరోజూ ఫోన్‌లో సమీక్షిస్తారన్నారు. తిరుమలలో భౌతికదూరం పాటిస్తూ దర్శన ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్‌ కితాబిచ్చారు. 

Updated Date - 2020-07-10T10:38:17+05:30 IST