వారంలో.. రోజుకు 600కూ చేరొచ్చు
ABN , First Publish Date - 2020-07-18T11:03:00+05:30 IST
‘ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ కేసులు రోజుకు 300కుపైగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితిచూస్తుంటే వారంలో 600కు చేరుకున్నా ..

కరోనా కేసులపై కలెక్టర్ భరత్‌గుప్తా
ప్రైవేటు ఆస్పత్రులూ ముందుకు రావాలని పిలుపు
తిరుపతి (వైద్యం), జూలై 17: ‘ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ కేసులు రోజుకు 300కుపైగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితిచూస్తుంటే వారంలో 600కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అని కలెక్టర్ భరత్‌గుప్తా పేర్కొన్నారు. డాక్టర్లు, జడ్పీలకు కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు సిద్ధమైన తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని శుక్రవారం ఆయన పరిశీలించారు. మూడు రోజుల్లో కొవిడ్ వైద్య సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రిలో ప్రాథమిక స్థాయి కరోనా వ్యాధి సోకిన (మైల్డ్ కేసులు) వారికి వైద్యసేవలు అందించాలన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, ఉద్యోగులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సస్పెండు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులతో ఆర్డీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈఎస్‌ఐ నుంచి టెలీ మెడిసిన్ సిస్టమ్‌ను స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రికి అనుసంధానం చేయాలన్నారు.
ఆ తర్వాత ప్రైవేటు ఆసత్రురల అధినేతలతో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకు మూతబడిన అన్ని ఆస్పత్రులను తక్షణమే తెరవాలని సూచించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వ వైద్యుల సమన్వయంతో కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ ఖాళీగా ఉన్న బెడ్ల సంఖ్యను ప్రజలకు తెలియజేయాలన్నారు. తద్వారా అవసరమైన వారు త్వరగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతారన్నారు. ఇప్పటికే రుయా కొవిడ్ ఆస్పత్రితో పాటు శ్రీనివాసం, తిరుచానూరు శ్రీపద్మావతి నిలయం పూర్తిగా నిండిపోయాయన్నారు. విష్ణు నివాసాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
తర్వాత మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రజలు రోడ్లపైకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. జేసీ వీరబ్రహ్మం, ఈఎస్‌ఐ, రుయా సూపరింటెండెంట్లు డాక్టర్ బాలశంకర్‌రెడ్డి, డాక్టర్ భారతి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శ్రీహరి రావు, డాక్టర్ రవిరాజు, డాక్టర్ కృష్ణప్రశాంతి, డాక్టర్ యుగంధర్, ప్రయివేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ధనంజయ రెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.