నెలకే చీకిలబైలులో ‘అమూల్‌’ మూత

ABN , First Publish Date - 2020-12-28T05:58:02+05:30 IST

గతనెల 21న మదనపల్లె మండలం చీకిలబైలు లోని రైతుభరోసా కార్యాలయంలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభించగా నెలరోజులకే ఆ కేంద్రం మూతపడింది.

నెలకే చీకిలబైలులో ‘అమూల్‌’ మూత

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 27: గతనెల 21న మదనపల్లె మండలం చీకిలబైలు లోని రైతుభరోసా కార్యాలయంలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభించగా నెలరోజులకే ఆ కేంద్రం మూతపడింది. అమూల్‌కు పాలు పోయడానికి అక్కడి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం, అమూల్‌ సంస్థ సంయుక్తంగా మదనపల్లె, రామసముద్రం మండలాల్లోని 100 పాలసేకరణ కేంద్రాల్లో పాలసేకరణ ప్రారంభించింది. కొన్ని కేంద్రాల్లో పాలసేకరణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం రైతుభరోసా కేంద్రాలతో పాటు అద్దెగదులు తీసుకుని మహిళాసంఘాలను భాగస్వామ్యం చేసింది. అయితే అమూల్‌ నాణ్యతలో రాజీపడకపోవడంతో అటు అధికారులు, ఇటు రైతులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. కొన్నిచోట్ల పాల నాణ్యత లేకపోవడంతో తీసుకోవడం లేదు. ఒకరోజు వేసి మరో రోజు నాణ్యత లేదని తీసుకోకపోవడంతో విసుగుచెందిన పాలరైతులు పూర్తిగా నిలిపేశారు. అదేవిధంగా దుబ్బిగానిపల్లె పాలసేకరణ కేంద్రంలో కేవలం నలుగురు రైతులు కేవలం 5లేదా 6లీటర్లు మాత్రమే అమూల్‌కు పాలు పోస్తున్నట్లు పాడి రైతులు చెప్పారు. డెయిరీకి ఎన్నిలీటర్లు పాలు వస్తున్నాయో అధికారులు చెప్పడం లేదు. ఈవిధంగా ఉంటే ప్రైవేటు డెయిరీలకు పాలసేకరణలో ఢోకా లేనట్టే అని ఏజెంట్లు, పాడిరైతులు చర్చించుకోవడం విశేషం.

Updated Date - 2020-12-28T05:58:02+05:30 IST