సీఐ వెంకటప్ప ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2020-03-12T11:02:34+05:30 IST

తిరుపతి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సీఐ కుటాల వెంకటప్ప, ఆయన అత్త వెంకటలక్ష్మి ఇళ్లల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సీఐ వెంకటప్ప ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో సెంట్రల్‌ టీమ్‌ తనిఖీలు


తిరుపతి(నేరవిభాగం), మార్చి 11: తిరుపతి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సీఐ కుటాల వెంకటప్ప, ఆయన అత్త వెంకటలక్ష్మి ఇళ్లల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతోనే ఈ దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం జీన్లకుంటకు చెందిన కె.వెంకటప్ప తిరుపతి నగరం మారుతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. 1996లో ఎస్‌ఐగా నియమితులైన ఆయన ప్రస్తుతం తిరుపతి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సీఐగా పనిచేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి అర్బన్‌జిల్లాలోని ప్రాంతాల్లో ఆయన ఎక్కువకాలం పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కారణంతో విజయవాడలోని ఏసీబీ సెంట్రల్‌ కార్యాలయాధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా తిరుపతికి చేరుకున్న ఏసీబీ అధికారులు మారుతీనగర్‌లోని వెంకటప్ప ఇంట్లోను, ఆయన అత్త వెంకటలక్ష్మి ఇంట్లోను ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. బ్యాంకు పాస్‌ పుస్తకాలు, ఇతర స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తెరిచి పరిశీలించారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రారంభమైన ఈ తనిఖీలు పొద్దుపోయే వరకు సాగాయి.


తిరుపతి అర్బన్‌ ఏసీబీ డీఎస్పీ జనార్దన నాయుడు, విజయవాడ ఏసీబీ సెంట్రల్‌ కార్యాలయ సీఐ శ్రీనివాసులు, మరికొందరు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విజయవాడ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. దాడుల్లో వెలుగుచూసిన వెంకటప్ప ఆస్తుల వివరాలను వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సీఐ వెంకటప్పను అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పేర్కొన్నారు. 


వెలుగు చూసిన ఆస్తులు 

తిరుచానూరు దళితవాడలో 2008లో వెంకటప్ప పేరిట ఇంటి స్థలాన్ని కొన్నారు. 


 ఎం.ఆర్‌.పల్లెలో జీ+ 2 ఇల్లును తన భార్య పూల దేవయాని పేరుమీద 2013లో కొనుగోలు చేశారు. 


ఎం.ఆర్‌.పల్లె ధనలక్ష్మినగర్‌లో తనపేరు, తన భార్యపేరుమీద జీ+4 ఇల్లు నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణంలో ఉంది. 


2009, 2014 సంవత్సరాల్లో తిరుపతి రూరల్‌ అవిలాల గ్రామ పంచాయతీలో మూడు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. 


2011లో తిరుపతి రూరల్‌ అవిలాల గ్రామపంచాయతీ పరిధిలో రెండు వ్యవసాయ భూములను కొన్నారు. 


రూ. 9 లక్షలకు ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. 


రూ.4 లక్షల విలువజేసే 160 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారు. 


 రూ.1,25,000 బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్టు వెల్లడైంది. 

Updated Date - 2020-03-12T11:02:34+05:30 IST