-
-
Home » Andhra Pradesh » Chittoor » chittor ex mla satyaprabha final farewell
-
సత్యప్రభకు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2020-11-21T06:45:24+05:30 IST
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని వైదేహీ ఆస్పత్రి ఆవరణలో జరిగాయి.

హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు
టీడీపీ జెండాను భౌతికకాయం మీద కప్పిన నేతలు
భర్త ఆదికేశవులు సమాధి పక్కనే అంత్యక్రియలు
చిత్తూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని వైదేహీ ఆస్పత్రి ఆవరణలో జరిగాయి.పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై దివంగత నాయకురాలికి ఘనంగా నివాళులర్పించారు.కరోనా సోకడంతో అక్టోబరు 10వ తేదీ నుంచి ఆమె తన కుటుంబ నిర్వహణలో వున్న వైదేహీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.గతంలో ఆమె భర్త డీకే ఆదికేశవులు అంత్యక్రియలను వైదేహీ ఆస్పత్రి ఆవరణలోనే జరిపారు. భర్త సమాధి పక్కనే సత్యప్రభ భౌతికకాయం ఉంచి ఆమె కుమారుడు డీఏ శ్రీనివాస్ సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు.చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ నేతలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు శుక్రవారం పెద్దఎత్తున బెంగళూరుకు చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. ఆమె కుమారుడు డీఏ శ్రీనివాస్, కుమార్తెలు తేజేశ్వరి, కల్పజ తదితర కుటుంబ సభ్యులను ఓదార్చారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హైదరాబాద్‌లోని సొంతింట్లో సత్యప్రభ చిత్రపటానికి నివాళులర్పించారు.అంతకుముందు ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.టీడీపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు హాజరై పార్టీ జెండాను ఆమె భౌతికకాయం మీద కప్పి నివాళులర్పించారు.టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు నాని,అధికార ప్రతినిధి పట్టాభి,నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ మాల్యాద్రి తదితరులు విజయవాడలో సత్యప్రభ చిత్రపటానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు నగర టీడీపీ కన్వీనర్ కఠారి ప్రవీణ్, మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ బుల్లెట్ సురేష్, కాణిపాక ఆలయ పాలకమండలి మాజీ సభ్యుడు మహేష్, చిత్తూరు మాజీ కార్పొరేటర్లు కందా, నవీన్, శ్రీకాంత్, బలిజ సంఘం చిత్తూరు నగర అధ్యక్షుడు ఓఎం రామ్‌దాస్ తదితరులు నివాళులర్పించిన వారిలో వున్నారు.
టీడీపీకి తీరని లోటు: చంద్రబాబు
సత్యప్రభ మరణం దిగ్ర్భాంతిని కలిగించింది. ఎమ్మెల్యేగా చిత్తూరు నగర తాగునీటి కొరత నివారణకు, చెరువుల అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు. పారిశ్రామిక, విద్యాసంస్థల ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారు. ఆమె మరణం టీడీపీతో పాటు చిత్తూరు జిల్లాకు కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.
ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు: నారా లోకేష్
ఎమ్మెల్యేగా చిత్తూరు సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. శ్రీనివాసా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మందికి అండగా నిలిచారు. విద్యా సంస్థలు, పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన సత్యప్రభ గారి మృతి తీరని లోటు.
టీడీపీ పెద్ద దిక్కును కోల్పోయింది: అచ్చెన్నాయుడు,నాని
తెలుగుదేశం పార్టీ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. సత్యప్రభ కుటుంబం పార్టీకి అన్నివిధాలా సహాయ సహకారాలను అందించేది. దేవాలయాలు, మసీదులు, దర్గాలు.. ఇలా మతాలకు అతీతంగా విరాళాలు అందించేది.చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో సత్యప్రభ ప్రత్యేకంగా కృషి చేశారు.ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి.
అభివృద్ధిలో సత్య‘ప్రభ’
చిత్తూరు ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు సత్యప్రభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. చిత్తూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. సంతపేట రహదారి విస్తరణను ప్రజలతో చర్చించి పూర్తి చేశారు. మురకంబట్టు- దొడ్డిపల్లె మధ్యలో నీవానదిపైన బ్రిడ్జి నిర్మించి వాహనదారుల సమస్యను తీర్చారు. నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం భూగర్భజలాలను పెంచేందుకు గంగినేని, కాజూరు, కట్టమంచితో పాటు పలు చెరువుల అభివృద్ధికి కృషి చేశారు. నగర ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు మిట్టూరు, దుర్గానగర్ కాలనీ, గంగినేని చెరువుల వద్ద పార్కులను అభివృద్ధి చేశారు.నగర ప్రజలకు మంచినీటి వసతి అందించేందుకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 15కుపైగా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.చిత్తూరు గాంధీ సర్కిల్‌ను రూ.50 లక్షల నిధులతో సుందరీకరించారు. కరోనా లాక్‌డౌన్ సమయాన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో వసతి కల్పించి భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. చిత్తూరు బైపాస్‌లో డీకే ఆదికేశవులు మెమోరియల్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి ఉచిత వైదాన్ని అందిస్తున్నారు. వైజాగ్ హుద్‌హుద్ తుఫాను బాధితుల కోసం చిత్తూరులో సంగీత విభావరి నిర్వహించి రూ.5 కోట్లను అప్పటి సీఎం చంద్రబాబుకు అందించారు.
ఆధ్యాత్మిక చింతన అధికం
భర్త డీకే ఆదికేశవులు మరణం తర్వాత 2014లో రాజకీయాల్లో అడుగుపెట్టి టీడీపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యే అయిన సత్యప్రభ అసెంబ్లీ మహిళా కమిటీ ఛైర్మన్‌గా పనిచేయడంతో పాటు స్పీకర్ లేనప్పుడు ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. చిత్తూరు సమస్యల గురించి పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు.ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉండే సత్యప్రభ తన భర్త టీటీడీ ఛెర్మన్‌గా పనిచేసిన కాలంలో వెంకటేశ్వరస్వామి అలంకరణ వస్తువులను అందజేశారు. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వాముల చేతుల మీదుగా కాణిపాకం వినాయకుడికి రూ.20 లక్షలతో వెండి కవచం అందజేశారు. చిత్తూరు మార్కెట్ చౌక్‌లో శ్రీదేవి, భూదేవి, ఆంజనేయ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, ఇరువారంలో బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు.

