-
-
Home » Andhra Pradesh » Chittoor » chittoor sotre dealers tension over on pending commission
-
కమీషన్ కూడా ఇవ్వరా!
ABN , First Publish Date - 2020-12-31T05:23:15+05:30 IST
ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి కమీషన్ విడుదలలో జాప్యంపై చిత్తూరు జిల్లాలోని చౌకదుకాణ డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

చిత్తూరు(సెంట్రల్), డిసెంబరు 30: లాక్‌డౌన్ సమయంలో ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి కమీషన్ బకాయిలు అందక పోవడంపై జిల్లాలోని చౌకదుకాణ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలతో పేదలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పేదలకు ఉచిత బియ్యం తదితర వస్తువుల పంపిణీ జరిగింది. జిల్లాలో అంత్యోదయ అన్నయోజన, తెల్లరేషన్ కార్డులు 11,88,779 ఉన్నాయి. మొత్తం 2901 చౌకదుకాణ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యం, కందిపప్పు, చక్కెర కార్డుదారులకు అందజేశారు. ఇందుకుగాను ఒక్కో కార్డుకు డీలర్‌కు రూ.18 వంతున ప్రభుత్వం కమీషన్ ఇస్తోంది. ఆ మేరకు ఈ ఏడాది జూలై నుంచి 11 కోటాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.3 కోట్ల కమీషన్ బకాయిలు డీలర్లకు అందాల్సి ఉంది. ఆ సొమ్ము అందక పోవడంతో జనవరి నెల రేషన్ కోటా విడుదలకు డీడీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు డీలర్లు వాపోతున్నారు. ఈ విషయమై ఇటీవల డీలర్ల సంఘం నాయకులు పౌరసరఫరాల సంస్థ డీఎం సోమయాజులు, డీఎస్వో శివరాంప్రసాద్‌ను కలసి సమస్య పరిష్కరించాలని విన్నవించారు. పెద్దమొత్తంలో కమీషన్ అందక జనవరి కోటా విడుదలకు డీడీలు కట్టడం భారంగా మారిందన్నారు. ఇప్పటికే అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామనీ, కమీషన్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.