ని‘వర్రీ’

ABN , First Publish Date - 2020-11-26T17:16:48+05:30 IST

నివర్‌ తుఫాను ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి..

ని‘వర్రీ’

చలి... చినుకులు ..ఈదురు గాలులు

ముసురు ముట్టడిలో జిల్లా

ప్రాజెక్టులు, చెరువుల వద్ద అప్రమత్త చర్యల్లో అధికార యంత్రాంగం

ఇబ్బందులుంటే 100, 9440900005నెంబర్లకు సమాచార మివ్వాలన్న కలెక్టర్‌,ఎస్పీ

సహాయక చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసాయి. ప్రాంతాల వారీగా 20డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జల్లులతో, చలి వాతావరణంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.  గురువారం తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.కలెక్టర్‌ భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సహా ఇతర అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులను, లోతట్టు ప్రాం తాలను పరిశీలించడంతో పాటు టెలీ కాన్ఫరెన్సు, సమావేశాలను నిర్వహించారు. గతంలో కురిసిన వర్షా లతో నిండిన పలు ప్రాజెక్టులకు నీరు చేరుతుండడం తో అధికారులు గేట్లను ఎత్తివేశారు. 90శాతం చెరువుల్లోకి నీళ్లు చేరాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతాల్లోని చెరువులన్నీ నిండిపోయాయి. తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. పరిస్థితిని బట్టి శుక్రవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. 


చిత్తూరు కలెక్టరేట్‌తో పాటు మూడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలైన చిత్తూరు, మదనపల్లె, తిరుపతి ప్రాంతాల్లో కంట్రోల్‌ రూములను ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం నంబరు 08572 242753. 14 మందిని నియోజకవర్గ, 66మందిని మండల స్థాయిలో ప్రత్యేక అధికారులుగా నియమించారు.


32మంది సభ్యులతో కూడిన మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలు జిల్లా కేంద్రం చిత్తూరుకు చేరుకున్నాయి. విజయవాడ నుంచి 21 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందం తిరుపతి కేంద్రంలో ఉన్నాయి.


ఇప్పటికే బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అవసరాన్ని బట్టి శుక్రవారం కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మండల, జిల్లా స్థాయి అధికారులు పనిచేసే ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి వెళ్లకూడదని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.


అన్నిశాఖల ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి  శుక్రవారం వరకు సెలవులను రద్దు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆదేశాలున్నాయి.


లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారికి ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువులను సిద్ధం చేయాలని జేసీ మార్కొండేయులు పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎంఎల్‌ పాయింట్లలో నిల్వలు పెంచాలన్నారు.


చెరువుల నుంచి నీళ్లు గ్రామాల్లోకి వెళ్లకుండా ఉం డేందుకు ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ అధికారులు ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. అన్ని చెరువుల వద్ద పెట్రోలింగ్‌ టీములను ఏర్పాటు చేశారు.


ఇప్పటికే కాళంగి, అరణియార్‌, కృష్ణాపురం, పెద్దేరు, మల్లెమడుగు, ఎన్టీఆర్‌ జలాశయం వంటి మేజర్‌ ప్రాజెక్టుల గేట్లను అవసరాన్ని బట్టి ఎత్తేశారు. ఆయా మేజర్‌ ప్రాజెక్టుల వద్ద బాధ్యత కలిగిన ఇంజనీరింగ్‌ అధికారులను నియమించారు. వారు ప్రతి గంటకూ ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ అవసరమైతే మళ్లీ గేట్లు తీసేందుకు సిద్ధమయ్యారు.


జిల్లావ్యాప్తంగా 7648 చిన్న చెరువులుండగా.. వాటిలోకి 55.68 శాతం నీళ్లు చేరినట్లు ఇరిగేషన్‌ అధికారులు ప్రకటించారు. వీటిలో 1522 చెరువులు పూర్తిగా, 1622 చెరువులు 75శాతం, 1516 చెరువులు 50శాతం, 2353 చెరువులు 25 శాతం నిండగా.. 635 చెరువులు నిండలేదు.


రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయ, విద్యుత్తు, పంచాయతీరాజ్‌ వంటి సంబంధిత అధికారులు సమన్వ యం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు.చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమా ర్‌, చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుత్తూరు డీఎస్పీ యశ్వంత్‌, కార్వేటినగరం సీఐ సురేంద్రరెడ్డి, ఇతర పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి బుధవారం కృష్ణాపురం ప్రాజెక్టును పరిశీలించారు.


ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: కలెక్టర్‌ భరత్‌గుప్తా

తుఫాను నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశాం.తూర్పు ప్రాంతంలో 12 మండలాల్లోని 2 వేల మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించాం. అవసరాన్ని బట్టి వారిని సురక్షిత ప్రాంతాలను తరలిస్తాం. బుధ, గురువారం పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అధికారులను నియమించాం. తుఫాను సమయంలో ప్రజలంతా ఇంట్లో నుంచి బయటికి రాకండి.


లోతట్టు ప్రాంతాలపై నిఘా: ఎస్పీ సెంథిల్‌కుమార్‌

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ‘డయల్‌ 100’ లేదా పోలీస్‌ వాట్సాప్‌ నెంబరు 9440900005కు సమాచారం ఇవ్వండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నాం. లోతట్టు ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశాం.


వైద్యులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి: డీఎంహెచ్‌వో 

తుఫాన్‌ కారణంగా వైద్య సేవలకు ఆటంకం కలగకుండా  పీహెచ్‌సీ వైద్యాధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని డీఎంహెచ్‌వో పెంచలయ్య ఆదేశించారు. ముందస్తు వైద్య సేవలతో పాటు గర్భవతులకు, చిన్న పిల్లులకు, వృద్ధులకు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు. డెలివరి డేట్‌ దగ్గరున్న గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డీఎంహెచ్‌వోకు సమాచారం ఇవ్వాలన్నారు. 


బీఎన్‌కండ్రిగలో 124.2 మి.మీ. వర్షపాతం 

చిత్తూరు: నివర్‌ తుఫాను ప్రభావంతో బుధవారం జిల్లాలోని 55 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. సగటున 15.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బీఎన్‌కండ్రిగలో 124.2 మి.మీ., అత్యల్పంగా బైరెడ్డిపల్లెలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా... వరదయ్యపాళెంలో 99.6, కేవీబీపురంలో 94, తొట్టంబేడులో 76, సత్యవేడులో 73.4, శ్రీకాళహస్తిలో 61.4, నగరిలో 52, వడమాలపేటలో 50, విజయపురంలో 48.4, ఏర్పేడులో 47.2, నారాయణవనంలో 46, నిండ్రలో 44.4, పుత్తూరులో 42.4, నాగలాపురంలో 35.6, రామచంద్రాపురంలో 34.4, పిచ్చాటూరులో 32.6, తిరుపతి రూరల్‌లో 30.2, కార్వేటినగరంలో 29.2, ఎస్‌ఆర్‌పురంలో 22.8, రేణిగుంటలో 20.4, పాలసముద్రంలో 20.2, వెదురుకుప్పంలో 20, కలికిరిలో 17.2, సోమలలో 16.4, తిరుపతి అర్బన్‌లో 15.4, జీడీనెల్లూరులో 13.2, పెనుమూరులో 11.6, సదుంలో 10.6 మి.మీ., 27 మండలాల్లో 10.6 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.


సురక్షిత ప్రాంతాలకు 3015మంది తరలింపు

తిరుపతి: తుఫాను ప్రభావం 5 తూర్పు మండలాలపై తీవ్రంగా ఉంటుం దన్న సమాచారం మేరకు తిరుపతి డివిజన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.ముందస్తు చర్యల్లో భాగంగా 920 కుటుంబాలకు చెందిన 3015 మందిని సురక్షిత ప్రాంతా లకు తరలించామని ఆర్డీవో కనకనరసా రెడ్డి తెలిపారు. వీరికి నిత్యావసర వస్తువులు అందేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు.గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసులతో పాటు సిబ్బందిని ఉండేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు.విపత్తులు సంభవిస్తే ముందు జాగ్రత్తగా 21మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను సత్యవేడు లో ఉంచామన్నారు. అదేవిధంగా విద్యుత్‌ స్తంభాలు, చెట్లు పడిపోతే  ఫైర్‌ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఈసందర్భంగా కోరారు. 


తిరుమలలో ఈదురు గాలులు పావవినాశం గేట్ల ఎత్తివేత

తిరుమల: తిరుమలలో బుధవారం వేకువజాము నుంచి జల్లులు పడుతూనే వున్నాయి.సాయంత్రం నుంచి ఈదురు గాలులతో భక్తులు  ఇబ్బంది పడుతున్నారు.ఘాట్‌రోడ్లలో నెమ్మదిగా ప్రయాణించాలంటూ విజిలెన్స్‌ సిబ్బంది సూచిస్తున్నారు. ఘాట్‌రోడ్లలో తరచూ కొండ చరియలు విరిగిపడే ప్రదేశాల్లో అధికారులు నిఘా పెట్టారు.కొండపై చలితీవ్రత పెరిగింది. పొగమంచు భారీగా కప్పేస్తోంది. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలకు తిరుమలలోని ఐదు జలశయాలు నిండిపోయాయి. పాపవినాశనం డ్యాంలో నీరు అధికం కావడంతో గంట పాటు రెండు గేట్లను ఎత్తివేశారు. అలాగే కుమారధార, పసుపుధార డ్యాముల్లో నీరు ఓవర్‌ఫ్లో అవుతోంది. గోగర్భం డ్యాం కూడా నిండిపోవడంతో అర్థరాత్రి లేదా గురువారం ఉదయాన్నే గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి.


పలు రైళ్ల రద్దు.. దారిమళ్లిన కొన్ని రైళ్లు

తిరుపతి: నివర్‌ తుపాను నేపథ్యంలో హైదరాబాదు- తాంబరం, ముంబయి-బికనీర్‌, చెన్నై సెంట్రల్‌-సత్రగంజ్‌, తిరుపతి-చెన్నై (26 మాత్రమే), పుదుచ్చేరి-హౌరా మార్గాల్లో నడుస్తున్న రైళ్లను తాత్కాలికంగా రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు-ధన్‌పూర్‌, బెంగళూరు క్యాంట్‌-గౌహతి, యశ్వంత్‌పూర్‌-ధన్‌పూర్‌, తిరువనంతపురం-గోరఖ్‌పూర్‌, రేణిగుంట, గూడూరు, కాట్పాడి, ధర్బాంగా-మైసూరు, షాలిమార్‌-తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లను గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌ మీదుగా దారి మళ్లించామని తెలిపారు. అలాగే హెల్ప్‌లైన్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ (040-27833099) విజయవాడ (0866-276239), గుంతకల్లు (7815915608), గుంటూరు (0863-2266138) హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


ఎస్వీయూ డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదా

తిరుపతి: ‘నివర్‌’ తుఫాన్‌ నేపథ్యంలో ఎస్వీయూ పరిధిలో గురువారం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1న, పీజీ పరీక్షలు డిసెంబరు 2న నిర్వహిస్తామని సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు.


తూర్పున హై అలర్ట్‌: జేసీ-2, ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన

శ్రీకాళహస్తి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫానుతో తూర్పు మండలాల్లో జడివాన పట్టుకుంది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా బుధవారం అంతా కురిసింది. జడివానతో జనజీవనం స్తంభించింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో తూర్పున అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. జాయింట్‌ కలెక్టరు-2 వీరబ్రహ్మం, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి రక్షేతస్థాయిలో పరిశీలించడంతో పాటు... నష్ట నివారణ కోసం అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. జేసీ వీరబ్రహ్మం ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం మండలాల్లో పర్యటించారు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి కేవీబీపురం, పిచ్చాటూరు. నాగలాపురం మండలాల్లో పర్యటించారు.


ఆయా మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫానుతో నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు గురించి అధికారులకు వివరించారు. కేవీబీపురం మండలం పూడి గ్రామ సమీపంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టును వారు పరిశీలించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మార్గంలో ఎవరినీ అనుమతించవద్దని అధికారులను అదేశించారు. ఇక జడివాన కారణంగా శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖినది నీటిమట్టం మరింత పెరిగింది. దీంతో నది ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా అఽధికారులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో పాటు... రెవెన్యూ, నీటిపారుదల, పోలీసుశాఖ అధికారులు స్వర్ణముఖినది ఒడ్డున ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 


Updated Date - 2020-11-26T17:16:48+05:30 IST