మా వేలుతో మా కళ్లే పొడుస్తారా?
ABN , First Publish Date - 2020-10-04T16:24:43+05:30 IST
రాష్ట్రంలో ఏడాదిగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండించలేక, వారికి అండగా..
జిల్లా దళితవర్గాల్లో ఆవేదన
వైసీపీ దళితనేతల ఎదురుదాడి తీరుపై ఆందోళన
తిరుపతి,ఆంధ్రజ్యోతి: రాష్ట్రంలో ఏడాదిగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండించలేక, వారికి అండగా నిలబడనూ లేక సతమతం అవుతున్న జిల్లాలోని అధికార వైసీపీ దళితనేతలు ఇప్పుడు మరింత ఇరకాటంలో పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న సంఘటనల పట్ల మౌనంగా ఉండి మొహం చాటేస్తున్న వీరు అధిష్ఠానం ఆదేశంతో నోరువిప్పాల్సి వస్తోంది. గురువారం, శుక్రవారం జడ్జి రామకృష్ణ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, దళిత సంఘాల చలో మదనపల్లె కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి పడ్డ తపన జిల్లాలోని దళితవర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి.
ఎమర్జెన్సీ రోజులను తలపించేలా దళిత, వామపక్ష పార్టీలను వెంటాడి నిర్బంధించి, భయభ్రాంతులకు గురిచేసిన తీరు ఈ వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీలోని తమ సామాజికవర్గం నాయకులే నోరువిప్పి, ఈ సంఘటనలపై వ్యతిరేకంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్న తీరు వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణ నేతలు ఇందరున్నా తమవర్గం నేతలతోనే మాట్లాడించడం తమ వేలుతో తమ కన్నే పొడిపించడంలా ఉందని బాధపడుతున్నారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో ఆందోళన
రాష్ట్రంలో ఏడాది కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వరుసబెట్టి జరుగుతున్న దాడులు, దౌర్జన్యకర సంఘటనల పట్ల జిల్లాలోని అట్టడుగు సామాజికవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్-19 సంక్షోభంలో వైద్య సిబ్బందికి కనీసం గ్లవుజులు, మాస్కులు కూడా లేవంటూ వ్యాఖ్యానించిన డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా వేధించిన ఘటనతో జిల్లావ్యాప్తంగా దళితులే కాకుండా అట్టడుగు, బలహీన వర్గాలకు చెందిన వారంతా ఉలికిపాటుకు లోనయ్యారు. అదెక్కడో జరిగిందని సరిపెట్టుకునే సమయంలోనే జిల్లా నడిబొడ్డున పెనుమూరు మండల వైద్యాధికారిణి అనితారాణికి ఎదురైన చేదు అనుభవం ఆ వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. ఇక ఈ జిల్లాలోనే బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ వ్యవహారం తెలిసిందే. ఆయనపై జరిగిన వేధింపులు, ఆయన సోదరుడిపై జరిగిన దాడి వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా దళిత, బలహీన వర్గాలతో పాటు ప్రతిపక్షాలను సైతం కదిలించాయి.ఈ పరిణామాలతో క్రమేపీ జిల్లాలోని సంబంధిత సామాజికవర్గంలో ఆందోళన రేగుతోంది.
ఇరకాటంలో వైసీపీ దళిత నేతలు
అధికార పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు దళితులపై జరుగుతున్న వరుస వేధింపు ఘటనల పట్ల బాగా ఇరకాటంలో పడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది వారి పరిస్థితి. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తే పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ముఖ్యనేతలు భావించే ప్రమాదముంది. అదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్తు, తమ ప్రయోజనాలు, నేతల వద్ద చనువు, పలుకుబడీ అన్నీ కోల్పోవాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. అదే సమయంలో మౌనంగా వుంటే సొంత సామాజికవర్గానికి దూరమవుతామేమో అనే భయం వెంటాడుతోంది. ఏం చేయాలో తోచక, ఏమీ మాట్లాడలేక సతమతమవుతున్న సమయంలో వైసీపీ అధిష్ఠానం ఆదేశంతో అనివార్యంగా నోరు విప్పాల్సి వచ్చింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళనతో వారున్నట్టు తెలుస్తోంది.
ఎదురుదాడికీ మేమే కనిపించామా అని ఆందోళన
ఛలో మదనపల్లె కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు గట్టిగా పోరాడిన శుక్రవారం నాడే చిత్తూరు ఎంపీ నల్లకొండక్కగారి రెడ్డెప్ప తిరుపతి వచ్చి మరీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సవాలు విసిరారు. జడ్జి రామకృష్ణపై వేధింపుల వ్యవహారంలో మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం వుందని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అయితే ఓ అడుగు ముందుకేసి ‘రామకృష్ణగారూ మీరెక్కడ ఉన్నారు? జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మీద ఇంకొకసారి మాట్లాడితే నాలిక కోస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు?’ అని హెచ్చరిస్తూ జడ్జి రామకృష్ణ పెద్ద దొంగ, అవినీతిపరుడంటూ ఆరోపణలు చేశారు. మదనపల్లెలో కూడా ఎమ్మెల్యే నవాజ్ బాషా జడ్జి రామకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు తీసుకుని తీర్పులు చెప్పారంటూ ఆరోపణలు చేశారు. వీరిలో చిత్తూరు ఎంపీ, పూతలపట్టు ఎమ్మెల్యే ఇరువురూ దళిత సామాజికవర్గానికి చెందినవారే. మదనపల్లె ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి చెందిన వారు. ఇతర సామాజికవర్గాల నేతలు ఎందరో అధికారం చెలాయిస్తున్న స్థితిలో ఉన్నా వారెవ్వరూ మాట్లాడకుండా వీరు నోరువిప్పడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వీరి అనుచరులను ఇది ఆవేదనకు గురిచేస్తున్నట్టు ప్రచారం అవుతోంది. తమ వర్గాలపై జరుగుతున్న దాడులను తమ వర్గం నేతలే ఖండించడం తమ సామాజికవర్గంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన వీరిలో పెరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే తమ వేలితో తమ కన్నే పొడిపించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దళిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.