సీఎం సార్‌.. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి

ABN , First Publish Date - 2020-04-01T10:29:00+05:30 IST

‘సీఎం సార్‌.. నా బిడ్డను ప్రాణభిక్ష పెట్టండి’అంటూ..

సీఎం సార్‌.. నా బిడ్డకు   ప్రాణభిక్ష పెట్టండి

ఓ తల్లి వేడుకోలు


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): ‘సీఎం సార్‌.. నా బిడ్డను ప్రాణభిక్ష పెట్టండి’ అంటూ ఓ తల్లి వేడుకుంటున్నారు. మంగళవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని ఎంజీఆర్‌ వీధికి చెందిన ఖాజీ, హసీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో రెండో కుమారుడైన మహ్మద్‌(9నెలలు)కు ఐదు నెలల క్రితం జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నారికి గుండెలో మూడు రంధ్రాలు బ్లాక్‌ అయ్యాయని చెప్పారు.


ఆపరేషన్‌ చేయాలని.. రూ.7లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బు వారివద్ద లేకపోవడంతో ప్రస్తుతానికి మందులు వాడుతున్నారు. సోమవారం మళ్లీ జ్వరం రావడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చూపించారు. త్వరగా ఆపరేషన్‌ చేయకుంటే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. తమకు రేషన్‌ కార్డు కూడా లేదని చిన్నారి తల్లి హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం చేసి తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని.. అలాగే దయగల దాతలెవరైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాబ్యాంకు దర్గా బ్రాంచ్‌ అకౌంట్‌ నెంబరు 174110100095962కు నగదు జమచేయొచ్చని, పూర్తి వివరాలకు 814324 8369 నెంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2020-04-01T10:29:00+05:30 IST