వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీలో చిత్తూరు జిల్లాకు ఐదో స్థానం

ABN , First Publish Date - 2020-03-02T10:42:50+05:30 IST

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీలో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. ఆదివారం ఉదయం ఆరు గంటలకే జిల్లాలోని 1,035 గ్రామ, 277 వార్డు సచివాలయాల కార్యదర్శులు పర్యవేక్షణలో 15,996 మంది వలంటీర్లు తమ పరిధిలోని పింఛనుదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను సొమ్మును అందజేశారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీలో  చిత్తూరు జిల్లాకు ఐదో స్థానం

 90.72 శాతం మందికి పింఛను సొమ్ము అందజేత

మిగిలిన వారికి నేడు పంపిణీ చేస్తాం: డీఆర్‌డీఏ పీడీ


చిత్తూరు అర్బన్‌, మార్చి 1: వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీలో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. ఆదివారం ఉదయం ఆరు గంటలకే జిల్లాలోని 1,035 గ్రామ, 277 వార్డు సచివాలయాల కార్యదర్శులు పర్యవేక్షణలో 15,996 మంది వలంటీర్లు తమ పరిధిలోని పింఛనుదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను సొమ్మును అందజేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 5,00,634 మంది వివిధ రకాల పింఛనుదారులున్నారు. వీరిలో రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. 4,54,176 మందికి పింఛను సొమ్మును అందజేశారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున వంద శాతం పూర్తిచేయాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు. మిగిలిన లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ మురళి తెలిపారు. 


జిల్లాల వారీగా వివరాలిలా.. 

రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. పశ్చిమ గోదావరిలో 4,71,181 వివిధ రకాల పింఛనుదారులుండగా.. 4,36,455 (92.63 శాతం) పంపిణీతో తొలి స్థానంలో నిలిచింది. కడపలో 3,29,525 మందికిగాను 3,05,102 (92.59 శాతం) పంపిణీతో రెండో స్థానంలో, విజయనగరంలో 3,26,572కుగాను 2,97,883 (91.22 శాతం) పంపిణీతో మూడో స్థానంలో, నెల్లూరు జిల్లాలో 3,42,976కుగాను 3,12,795 (91.20 శాతం) పంపిణీతో నాల్గవ స్థానంలో, చిత్తూరు జిల్లాలో 5,00,634 మందికిగాను 4,54,176 (90.72 శాతం) మందికి పింఛను సొమ్ము అందజేయడంతో ఐదో స్థానంలో నిలిచింది.


పర్యవేక్షించిన కలెక్టర్‌ 

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 1: జిల్లాలో పింఛన్ల పంపిణీని కలెక్టర్‌ భరత్‌ గుప్తా పర్యవేక్షించారు. ఉదయం నుంచే డీఆర్‌డీఏ పీడీ మురళికి పలు సూచనలు చేస్తూ వచ్చారు. చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌, యాదమరి మండలంలోని కమ్మరాయనిమిట్టలో జరిగిన పింఛన్ల పంపిణీని డీఆర్‌డీఏ పీడీ పరిశీలించారు. పలువురికి పెన్షన్‌ కార్డులను అందజేశారు. 

Updated Date - 2020-03-02T10:42:50+05:30 IST