చిత్తూరుపై చెడుముద్ర
ABN , First Publish Date - 2020-03-16T11:36:35+05:30 IST
చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సదర్భంగా జరిగిన..
సామాన్యులకు చేరువైనా నేతల ఒత్తిళ్ళకు బలయ్యారు
అధికార పార్టీ ఒత్తిళ్ళతో మరుగున పడ్డ కలెక్టర్ సమర్థత
త్రిపుర నుంచి వచ్చిన రమేష్‌రెడ్డికి తిరుపతిలో చేదు అనుభవం
తిరుపతి(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల ఒత్తిడిని అధిగమించలేని బలహీనత ఆ ఇద్దరి ప్రతిభా సామర్ధ్యాలను మరుగున పడేలా చేసింది. అధికార పార్టీకి అనుకూలురుగా ముద్ర వేయించుకోవడంతో పాటు పాలనాపరంగా కూడా ఓ చెడు ముద్రతో జిల్లాను వీడాల్సిన దుస్థితి తలెత్తింది. జిల్లా చరిత్రలో ఏ కలెక్టరుకూ ఎదురుకాని అనుభవాన్ని భరత్‌గుప్తా ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీవారి సన్నిధిలో ఉద్యోగం చేయాలని పరితపించి త్రిపుర నుంచీ తిరుపతి వచ్చిన ఎస్పీ రమేష్ రెడ్డి నెల కూడా తిరక్కముందే బదిలీ వేటుకు గురవ్వాల్సివచ్చింది.
సామాన్య జనానికి చేరువై.... నేతల ఒత్తిళ్ళతో బలిపశువై...
తెలుగు వాడైన నారాయణ భరత్‌గుప్తా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. జిల్లాలో ఇదివరకూ మదనపల్లె సబ్ కలెక్టరుగా, జాయింట్ కలెక్టరుగా రెండు హోదాల్లో పనిచేసిన ఈ అధికారి గతేడాది ఎన్నికల అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. జిల్లా గురించి సమగ్రమైన అవగాహన కలిగిన ఈయన కలెక్టర్‌గా వచ్చాక సామాన్య జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. తనకున్న సైక్లింగ్ అలవాటును జిల్లా కేంద్రం చుట్టుపక్కల పలు మండలాలు, గ్రామాలు పర్యటించేందుకు అనువుగా మార్చుకున్నారు. సైకిల్‌పైనే గ్రామాలకు వెళుతూ టీ స్టాళ్ళ వద్ద ఆగి, సామాన్య జనంతో మాట్లాడేందుకు ఇష్టపడేవారు. తద్వారా స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. జిల్లాకేంద్రంలో కూడా తరచూ భార్యాబిడ్డలతో కలసి సామాన్యుడి తరహాలో పర్యటిస్తూ జనం దృష్టిలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.
పదేళ్ళ సర్వీసులో నిరాడంబరంగా వుంటారని, చురుకైన, సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలతో ఇదంతా తారుమారైపోయింది. భరత్‌గుప్తా నిరాడంబరత్వం, ప్రతిభా సమర్ధతలు మరుగునపడిపోయి అధికార పార్టీ నేతలు చెప్పిందల్లా వినే సాధారణ అధికారిగా ముద్ర వేసుకున్నారు. ఈసీ ఆగ్రహానికి, అసంతృప్తికీ గురై బదిలీ వేటుకు గురయ్యారు. జిల్లా చరిత్రలో ఏ కలెక్టరుకూ ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కొంటూ అధికార పార్టీ నేతల తప్పిదాలకు బలి పశువవుతున్నారు.
త్రిపుర నుంచీ ఏపీ కేడర్‌కు వచ్చి.... తిరుపతిలో చేదు అనుభవం
ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల రమేష్‌రెడ్డి 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. త్రిపుర రాష్ట్రంలో పనిచేస్తూ సొంత రాష్ట్రానికి రావాలని పట్టుబట్టి ఏపీ కేడర్‌కు మార్పించుకుని తిరుపతి అర్బన్ ఎస్పీగా వచ్చిన ఈయన స్వల్ప కాలానికే చేదు అనుభవం చవి చూడాల్సివచ్చింది. 13 ఏళ్ళ స్వల్ప సర్వీసులోనే అతి కొద్దిమందికి మాత్రమే దక్కే అపురూప అవకాశాలను దక్కించుకున్న అధికారిగా కెరీర్‌లో గర్వించదగ్గ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లో ఎస్పీగా పలు కీలక ఉగ్రవాద కేసులు దర్యాప్తు చేసిన రమేష్‌రెడ్డి అంతకు మించి దేశ అత్యున్నత గూఢచార విభాగమైన రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో పనిచేసే ఛాన్సు కొట్టేశారు. నిత్యం ఉగ్రవాద సమస్య నెలకొని వుండే త్రిపుర వంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంతజిల్లాలో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది.
ఇంతటి ప్రతిభా సామర్ధ్యాలు కలిగివున్న ఈ అధికారి త్రిపుర కేడర్ నుంచీ ఏపీ కేడర్‌కు మార్చుకుని తిరుపతి అర్బన్ ఎస్పీగా బదిలీ వచ్చి సరిగ్గా నెల కూడా కాలేదు. ఈ స్వల్ప వ్యవధిలోనే తిరుపతిలో తనదైన శైలిలో పర్యటనలు, తనిఖీలు జరిపి పోలీసింగ్‌ను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చాయి. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో ప్రతిపక్ష అభ్యర్థులపై దౌర్జన్యాలు, దాడులు, నామినేషన్ల అడ్డగింత వంటివి చోటుచేసుకున్నాయి. వాటిని నియంత్రించలేకపోవడానికి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి బాధ్యుడని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. అందుకే కలెక్టర్ భరత్‌గుప్తాతో పాటు ఇతడిపైనా బదిలీ వేటు వేసింది. శ్రీవారి సన్నిధిలో ఉద్యోగం చేయాలని పరితపించి ఎక్కడో ఈశాన్య సరిహద్దుల్లో వున్న త్రిపుర నుంచీ తిరుపతి వచ్చిన ఈ అధికారి నెల కూడా తిరక్కముందే అధికారపార్టీ నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి బదిలీ వేటుకు గురై బలిపశువయ్యారు.