కూతుళ్లంతా కనుమరుగు.. ఊరంతా కన్నీరు..
ABN , First Publish Date - 2020-08-16T15:09:32+05:30 IST
కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన కుమార్తెతో సహా..

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
కుప్పం/శాంతిపురం(చిత్తూరు): కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. సంఘటన శాంతిపురం మండలంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సి.బండపల్లె పంచాయతీ చిన్నూరుకు చెందిన రామకృష్ణప్ప, చంద్రశేఖర్, తిమ్మప్ప అన్నదమ్ములు. ముగ్గురూ తమ వ్యవసాయ పొలాల వద్ద వరుసగా ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు. వీరిలో రామకృష్ణప్ప భార్య పార్వతమ్మ (37)కు తోడికోడళ్లకి తరచూ గొడవలు జరిగేవి. పైగా ఇటీవల రామకృష్ణప్ప మద్యానికి బానిసయ్యాడు. వారం రోజులుగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో పార్వతమ్మ, చిన్న కుమార్తె దివ్య(12) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. రామకృష్ణప్పతోపాటు కుటుంబ సభ్యులు వారికోసం పలుచోట్ల వెదికారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నారాయణాచారి పైరుకు నీళ్లు కట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ బావిలో దివ్య మృతదేహం తేలుతూ కనిపించింది. పార్వతమ్మ మృతదేహం కూడా అదేబావిలో లభ్యమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త రామకృష్ణప్పను అదుపులోక తీసుకుని విచారిస్తున్నారు. కాగా కుటుంబ కలహాలతోనే పార్వతమ్మ, కుమార్తె దివ్యతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
కూతుళ్లంతా కనుమరుగు.. ఊరంతా కన్నీరు..
రామకృష్ణప్ప, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దకుమార్తె పవిత్ర ఒకటిన్నర సంవత్సరం క్రితం చింత చెట్టుమీద నుంచి పడి చనిపోయింది. ఇంకో మాకుర్తె ఆరేళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. చిన్న కుమార్తె దివ్య కూడా ఇప్పుడు మృతిచెందడంతో ఊరంతా కన్నీరుమున్నీరైంది. కాగా వారి కుటుంబంలో రామకృష్ణప్పతోపాటు కుమారుడు ప్రకాష్ (14) మాత్రమే మిగిలారు.