నాగలాపురం విశ్రాంత తహసీల్దార్‌కు చార్జి మెమో

ABN , First Publish Date - 2020-03-21T11:01:34+05:30 IST

నాగలాపురం మండలంలోని 27 సర్వే నెంబరులోని 143.85 ఎకరాల ప్రభుత్వ భూమిని 2014లో బోగస్‌ డీకేటీ పట్టా ద్వారా ఆన్‌లైన్‌లో ఎక్కించారు.

నాగలాపురం విశ్రాంత తహసీల్దార్‌కు చార్జి మెమో

 డిజిటల్‌ కీ దుర్వినియోగం చేశారంటూ అభియోగం


చిత్తూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నాగలాపురం మండలంలోని 27 సర్వే నెంబరులోని 143.85 ఎకరాల ప్రభుత్వ భూమిని 2014లో బోగస్‌ డీకేటీ పట్టా ద్వారా ఆన్‌లైన్‌లో ఎక్కించారు. అప్పట్లో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ వెంకట్రాయులుకు చార్జి మెమో ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈయన ప్రస్తుతం పదవీ విరమణ పొంది ఉన్నారు. నాగలాపురం మండలంలోని కుదివేడు గ్రామంలోని 27-3, 27-8 సర్వే నెంబర్లలో ఉన్న 143.85 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూమిని ఇద్దరు మహిళల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మణి భార్య షర్మిళ పేరుతో 27-3 సర్వే నెంబరులో, గురుస్వామి నాయుడు భార్య నాగరత్నమ్మ పేరుతో 27-8 సర్వే నెంబరులో భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించగా.. వీరికి ఎలాంటి డీకేటీ పట్టాలు లేవు.


బోగస్‌ పట్టాల ద్వారా డిజిటల్‌ కీని దుర్వినియోగం చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించినట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదే సర్వే నెంబరులోని మిగిలిన భూమి మరో 11 మంది పేరుతో ఆన్‌లైన్‌లో ఉందని, వారికీ డీకేటీ పట్టాలు లేవని తెలిసింది. కాగా.. 2014 మార్చి ఒకటి నుంచి జూన్‌ నాల్గవ తేదీ వరకు పనిచేసిన తహసీల్దార్‌ ఎంఎస్‌డీ సుధాకర్‌, 2014 జూన్‌ 13 నుంచి 2016 జూన్‌ 24వ తేదీవరకు పనిచేసిన తహసీల్దార్‌ వెంకట్రాయులు ఈ భూములను ఆన్‌లైన్‌ చేసినట్లు జీవోలో ఉంది. కానీ.. వెంకట్రాయులుకు మాత్రమే చార్జి మెమో జారీ చేస్తూ.. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2020-03-21T11:01:34+05:30 IST