వ్యాక్సిన్‌ వస్తోందని నిర్లక్ష్యం వద్దు.. జనవరిలో మరింత ముప్పు

ABN , First Publish Date - 2020-12-13T16:51:44+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం..

వ్యాక్సిన్‌ వస్తోందని నిర్లక్ష్యం వద్దు.. జనవరిలో మరింత ముప్పు

కొవిడ్‌ అడ్డుకట్టకు మాస్కే కవచం 

డీఎంహెచ్‌వో పెంచలయ్య


చిత్తూరు రూరల్: జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న నిర్లక్ష్యం వద్దు. వచ్చేనెల మరింత ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలి. ఇందుకు అనుగుణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో పెంచలయ్య స్పష్టం చేశారు. వైరస్‌ అడ్డుకట్టకు మాస్కే కవచమని సూచించారు. ఈనెలాఖరున కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందన్నారు. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందజేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

? కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉంటుం దన్న ప్రచారం జరుగుతోంది. వైరస్‌ అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలు 

! జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే వచ్చేనెల వైరస్‌ ప్రబలే ప్రమాదముందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను ప్రజలు గుర్తించాలి. సెకండ్‌ వేవ్‌ తీవ్రత అడ్డుకట్టకు ఈనెలారంభం నుంచే 50రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రోజుకో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 19వతేది వరకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. కొవిడ్‌ నియంత్రణ, మాస్కులు ధరించడంపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. 


? జిల్లాలో అధికశాతం కొవిడ్‌ కేర్‌ సెంటర్లు మూతబడ్డాయి. బాధితుల వైద్యసేవల పరిస్థితి 

! సాధారణ వైద్యసేవలందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. స్విమ్స్‌, రుయా, పద్మావతి కొవిడ్‌ కేర్‌సెంటర్‌ మినహా జిల్లావ్యాప్త కొవిడ్‌ ఆస్పత్రులను మూసివేశాం. స్విమ్స్‌, రుయాలో 800 పడకలు, పద్మావతి కోవిడ్‌కేర్‌ సెంటర్‌లో వెయ్యి పడకలు కొవిడ్‌ బాధితుల కోసం సిద్ధంగా ఉంచాం. 


? కొవిడ్‌ బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి 

! నిర్దేశిత ఫీజులు మాత్రమే వసూలు చేయాలని గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించాం. ఈ అంశంపై మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమై చర్చించనున్నాం. 


?వ్యాక్సిన్‌ పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారా 

! ఈనెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తొలుత హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందిస్తాం. తర్వాత 50ఏళ్లు పైబడిన, ఆపై 50లోపున్న బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు, పలుశాఖల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ పంపిణీ చేస్తాం. అనంతరం ప్రజలందరికీ అందజేస్తాం.


?వ్యాక్సిన్‌ పంపిణీపై వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారా 

! వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను ప్రారం భించాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యాక్సిన్‌ అందించడంపైనా అవగాహన కల్పించారు. 

Updated Date - 2020-12-13T16:51:44+05:30 IST