కరోనా వ్యాప్తి తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-10-24T11:54:51+05:30 IST
జిల్లాలో క్రమేపీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ జిల్లాలో 347 మందికి కరోనా వైరస్ సోకినట్టు టెస్టు ఫలితాలు నిర్ధారించాయి.

కొత్తగా 347 పాజిటివ్ కేసులు నమోదు
తిరుపతి నగరంలో 41... వంద రోజుల్లో ఇవే అత్యల్పం
78352కు చేరిన మొత్తం వైరస్ కేసుల సంఖ్య
తిరుపతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రమేపీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ జిల్లాలో 347 మందికి కరోనా వైరస్ సోకినట్టు టెస్టు ఫలితాలు నిర్ధారించాయి. ఇందులో తిరుపతి నగరంలో గుర్తించిన బాధితుల సంఖ్య 41 మాత్రమే. జిల్లాలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు సగం కేసులు తిరుపతిలో నమోదైనవేనన్న సంగతి తెలిసిందే. ఆ నేపధ్యంలో గత వంద రోజుల వ్యవధిలో నమోదైన కేసులను పరిశీలిస్తే గురు, శుక్రవారాల నడుమ నమోదైన 41 కేసులే అత్యల్పం.
కాగా కొత్తగా నిర్ధారణ అయిన వైరస్ బాధితుల విషయానికొస్తే వీరు తిరుపతి నగరంలో 41 మంది, చిత్తూరు మండలంలో 44 మంది, మదనపల్లెలో 40 మంది, పెద్దమండ్యం, తిరుపతి రూరల్ మండలాల్లో 14 మంది చొప్పున, పుంగనూరులో 12 మంది, గుడిపాల, కార్వేటినగరం, నగరి, పుత్తూరు మండలాల్లో 10 మంది చొప్పున వున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. తాజా బాధితులతో కలిపి ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 78352కు చేరుకుంది.కరోనా వైరస్‌తో మరో ఇద్దరు ప్రాణాలు వదలడంతో మొత్తం మృతుల సంఖ్య 756కు చేరింది.