దుబ్బాక, బీహెచ్ఎంసీ ఫలితాలలాగే.. తిరుపతిలో గెలవాలని..

ABN , First Publish Date - 2020-12-11T06:15:42+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ గురిపెట్టింది..

దుబ్బాక, బీహెచ్ఎంసీ ఫలితాలలాగే.. తిరుపతిలో గెలవాలని..

తిరుపతిపై బీజేపీ గురి

రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం

రానున్న జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు 


తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణలోని దుబ్బాక ఉపపోరు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయోత్సాహాన్ని ఇక్కడా కొనసాగించాలని భావిస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నుంచి గెలుపుబాట వేసుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సమర్థులైన నాయకులను తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో బూత్‌ కమిటీలకు ఇంచార్జిలుగా నియమించనున్నారు. వీరి ఆధ్వర్యంలో ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే గడప గడపకు బీజేపీ నినాదంతో ప్రచారం నిర్వహించిన బీజేపీ శ్రేణులు.. ఇప్పుడు ‘గుండె గుండెకు బీజేపీ’ నినాదంతో ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారని ఢంకా బజాయిస్తున్నారు. ప్రధాని మోదీ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, అధినాయకుల వ్యూహాలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసేతత్వం తమకు ప్రజాభిమానాన్ని తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 


నగరానికి బీజేపీ నాయకులు 

సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడైన తరువాత  నూతన  రాష్ట్ర కార్యవర్గ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. వీర్రాజు అధ్యక్షతన శనివారం తిరుపతిలో జరుగనున్న మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతికి చేరుకున్నారు. నగరంలోని పలు లాడ్జిలు బీజేపీ నాయకులు, ప్రధాన కార్యకర్తలతో నిండిపోయాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి, ఏపీ బీజేపీ ఇన్‌చార్జి మురళీధరన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ సహ ఇన్‌చార్జి సునిల్‌దియోధర్‌, మరో జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌ తదితర నాయకులతోపాటు సుమారు 250 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతికి రానున్నారు.

Updated Date - 2020-12-11T06:15:42+05:30 IST