దుబ్బాక దూకుడు కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2020-11-13T06:48:51+05:30 IST

తెలంగాణలోని దుబ్బాక ఎన్నికల ఫలితాలను తిరుపతిలో కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.

దుబ్బాక దూకుడు కొనసాగిస్తాం
బీజేపీ నేతల ఐక్య నినాదాలు

తిరుపతిలోనూ బీజేపీ, జనసేన పవనాలే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు


తిరుపతి(పద్మావతినగర్‌), నవంబరు 12: తెలంగాణలోని దుబ్బాక ఎన్నికల ఫలితాలను తిరుపతిలో కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం తిరుపతిలో జరిగింది.ఈ సందర్భంగానూ,అనంతరం మీడియా సమావేశంలోనూ సోమువీర్రాజు మాట్లాడుతూ... తిరుపతి ఉపఎన్నికలోనూ బీజేపీ, జనసేన పవనాలే వీస్తాయని ధీమాగా చెప్పారు.తిరుపతికి, రాష్ట్రానికి బీజేపీ చాలా చేసిందంటూ తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఎంపికచేసి వేలకోట్ల రూపాయల నిధులు అందిస్తోందన్నారు. అలాగే అనేక కేంద్రప్రభుత్వ సంస్థలను తిరుపతికి కేంద్రప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.  కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ తిరుపతికి ఏంచేశాయని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు.శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందన్నారు.ఎస్వీబీసీ ఛానల్లో ఎవరినంటే వారిని నియమించి 60-70 వేల జీతాలు ఇస్తున్నారని, అది ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. రూ. 1350 కోట్ల టీటీడీ బడ్జెట్లో ధర్మప్రచారానికి ఛానల్‌తో కలిపి రూ. 100 కోట్లు కేటాయించారని, అందులో రూ. 70 కోట్లు ఛానల్‌కే ఖర్చు అవుతుండగా కేవలం రూ. 30 కట్లు మాత్రమే ధర్మానికి ఖర్చుపెట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. టీటీడీకి ఎంతమంది మెంబర్లు కావాలి ఇదేమన్నా అన్‌ఎంప్లాయిమెంట్‌ స్కీమా అని ప్రశ్నించారు.ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముస్లింల గురించి ఈ మధ్య ఏదో మాట్లాడాడు. పొరపాటున కాదు... ఆయన నిజమే మాట్లాడాడు. వెంటనే ముఖ్యమంత్రి మొట్టడంతో... ఆ మాటలు వెనక్కు తీసుకుంటున్నానని ఆయన మొత్తుకున్నాడంటూ... ఇదీ వైసీపీలో ఎస్సీల పరిస్థితని వర్ణించారు.ఎస్సీ ఉపముఖ్యమంత్రికి గాని, ఎస్సీ హోంమంత్రికి కాని రాష్ట్రంలో ఒక్క కానిస్టేబుల్నైనా బదిలీచేసే శక్తి ఉందా అని ప్రశ్నించారు.కానీ బీజేపీలో ఓ బలమైన బీసీని ప్రధానిని చేసిందంటూ మోదీని గుర్తుచేశారు. త్వరలో బీజేపీ, జనసేన సమాలోచన జరిపి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి,అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... తిరుపతిలోనే కాదు... దేశవ్యాప్తంగానూ మోదీ నాయకత్వానికి ఎదురులేదని, బీజేపీకి తిరుగులేదన్నారు.  ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌,బీజేపీ నాయకులు శాంతారెడ్డి, సైకం జయచంద్రారెడ్డి, జల్లి మధుసూదన్‌, భవానీశంకర్‌, చంద్రారెడ్డి, ఎం.ఆర్‌. రాజ, పొన్నగంటి భాస్కర్‌, వెంకటముని, అజయ్‌కుమార్‌, డాక్టర్‌ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు సోమువీర్రాజు కండువాలు వేసి బీజేపీలోకి ఆహ్వానించారు. 

Updated Date - 2020-11-13T06:48:51+05:30 IST