పింఛను సొమ్ము ఇవ్వలేదని కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-03-02T10:53:51+05:30 IST

ముదిమి వయసులో బిడ్డలు ఆసరాగా ఉంటారనుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వమిచ్చే పింఛనుపై ఆధారపడి ఓ వృద్ధురాలు జీవిస్తోంది.

పింఛను సొమ్ము ఇవ్వలేదని కత్తితో దాడి

కుమారుడిపై తల్లి ఫిర్యాదు 


బి.కొత్తకోట, మార్చి 1: ముదిమి వయసులో బిడ్డలు ఆసరాగా ఉంటారనుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వమిచ్చే పింఛనుపై ఆధారపడి ఓ వృద్ధురాలు జీవిస్తోంది. ఆ కాసింత సొమ్ము ఇవ్వాలంటూ కుమారుడు కత్తితో దాడి చేయడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ కథనం మేరకు.. బి.కొత్తకోట మండలం తాకాటంవారిపల్లెకు చెందిన తమ్మిశెట్టి లక్ష్మీదేవమ్మ(80)కు నలుగురు బిడ్డలున్నారు. బిడ్డలు పట్టించుకోక పోవడంతో ప్రభుత్వమిచ్చే వితంతు పింఛనుపై ఆధారపడి ఆమె ఒంటరిగా జీవిస్తోంది.


ఈ క్రమంలో ఆదివారం ఆమె పెద్దకుమారుడు వెంకట్రమణ తల్లి వద్దకు వచ్చి పింఛను సొమ్ము ఇవ్వాలని కోరడంతో ససేమిరా అన్నారు. ఆవేశానికి గురైన ఆయన వేట కొడవలితో దాడి చేయడంతో లక్ష్మీదేవమ్మ మణికట్టుకు తీవ్రగాయమైంది. అపస్మారకస్థితిలో పడిన వృద్ధురాలిని మానవహక్కుల సంఘ ప్రతినిధి శివశంకర్‌ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీదేవమ్మ ఫిర్యాదు మేరకు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-02T10:53:51+05:30 IST