అర్జున్‌దాస్‌కు బాధ్యతలు అప్పగించండి

ABN , First Publish Date - 2020-03-13T11:21:43+05:30 IST

హథిరాంజీ మఠం మహంతుగా అర్జున్‌దాస్‌కు బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ఎండోమెంట్‌ విభాగానికి చెందిన ధార్మిక పరిషత్‌ ఆదేశాలు జారీచేసింది.

అర్జున్‌దాస్‌కు బాధ్యతలు అప్పగించండి

హథీరాంజీ మఠం ఫిట్‌ పర్సన్‌కు ధార్మిక పరిషత్‌ అదేశాలు 



తిరుపతి, మార్చి12 (ఆంధ్రజ్యోతి): హథిరాంజీ మఠం మహంతుగా అర్జున్‌దాస్‌కు బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ఎండోమెంట్‌ విభాగానికి చెందిన ధార్మిక పరిషత్‌ ఆదేశాలు జారీచేసింది. జనవరి 28న  అర్జున్‌దాస్‌ను ధార్మిక పరిషత్‌ పేరుతో ప్రభుత్వం సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ మహంతు హైకోర్టును ఆశ్రయించారు. అర్జున్‌దాస్‌నే మహంతుగా కొనసాగించాలని హైకోర్టు మూడు వారాలపాటు మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు బాధ్యతలు తీసుకునేందుకు అర్జున్‌దాస్‌ గత నెల14న తిరుపతిలోని హథిరాంజీ మఠం కేంద్ర కార్యాలయానికి అడ్వకేట్‌ను వెంటపెట్టుకుని వచ్చారు. ఆ సమయంలో ముక్కంటి ఆలయ ఈవో, మఠం ఫిట్‌పర్సన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి బాధ్యతలు అప్పగించలేదు.


దీనిపై ఆగ్రహించిన ఆయన.. కోర్టుధిక్కారం కింద సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించిన తీర్పు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేవదాయ శాఖ అధికారులు మహంతుకు గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీచేసింది.  కాగా ఫిట్‌పర్సన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి జిల్లాలో లేరని తెలుస్తోంది. బాధ్యతలు తీసుకునేందుకు మహంతు శుక్రవారమో.. శనివారమో మఠానికి రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఫిట్‌పర్సన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల మహంతుకు ఎవరు బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-03-13T11:21:43+05:30 IST