ఆగమోక్తంగా అష్టోత్తర శత కలశాభిషేకం
ABN , First Publish Date - 2020-12-15T05:37:16+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం పూజలు
శ్రీకాళహస్తి, డిసెంబరు 14: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అష్టోత్తర శత కలశాభిషేకం పూజలు ఆగమోక్తంగా జరిగాయి. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 4వతేదీ నుంచి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆదివారంతో ఈ పూజలు ముగియడంతో సోమవారం అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. తొలుత స్వామివారి గర్భాలయం ముందు కలశాలు స్థాపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమపూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అన్నం కుంభం వేశారు. కలశాలకు ఆఖండ హారతి సమర్పించారు. తర్వాత కలశాలను ఆలయంలో ఊరేగించి స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు కలశ జలంతో అభిషేకం, పూజలు చేశారు. కుంభం వేసిన నైవేద్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల అర్చనకు ఉపయోగించిన బిల్వపత్రాలు, కుంకుమతో మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయం నుంచి దక్షిణ గాలిగోపురం మీదుగా సన్నిధివీధి నుంచి స్వర్ణముఖినదిలోని స్నానపు ఘట్టాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ బిల్వ, కుంకుమ పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత పసుపు, కుంకుమను స్వర్ణముఖి నదిలో కలిపి నదీమ తల్లి హారతి సమర్పించారు. అనంతరం బిల్వ, కుంకుమ పూజా సామగ్రిని నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో హేమమాలిని, ఆలయ ఇన్స్‌పెక్టరు సుదర్శన్, విజయసారథి, సంబంధం గురుకుల్, కరుణాస్వామి తదితరులు పాల్గొన్నారు.
