ఆంధ్ర రీలర్లపై కక్ష సాధింపు చర్యలా?
ABN , First Publish Date - 2020-06-18T11:06:29+05:30 IST
రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పట్టుగూళ్లు కొనుగోళ్లు చేస్తుంటే పలమనేరు మార్కెట్ అధికారుల కక్ష సాధిస్తున్నారంటూ సిరికల్చర్

మదనపల్లె అర్బన్, జూన్ 17: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పట్టుగూళ్లు కొనుగోళ్లు చేస్తుంటే పలమనేరు మార్కెట్ అధికారుల కక్ష సాధిస్తున్నారంటూ సిరికల్చర్ జేడీ ఎదుట మదనపల్లె రీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్ అధికారి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న రీలర్ల ఫిర్యాదుపై విచారణ జరపడానికి సిరికల్చర్ జేడీ అరుణకుమారి బుధవారం మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా రీలర్లు మాట్లాడుతూ... మదనపల్లెలో పట్టుగూళ్లను నమ్ముకుని 1500 మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్ ముందు పట్టుగూళ్లు కిలో రూ.550, సిల్క్ ధర రూ.4200 ఉండేదన్నారు.
పట్టుదారం ధర రూ.2200కు పడిపోవడంతో నష్టపోయామన్నారు. ఇక ప్రతి రోజు మదనపల్లె నుంచి 60 కిల్లోమీటర్ల దూరంలో ఉన్న పలమనేరుకు వెళ్లి పట్టుగూళ్లు కొనుగోలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఈక్రమంలో అక్కడి రైతులనే పట్టుగూళ్లను మదనపల్లె మార్కెట్‌కు తీసుకురావాలని కోరామన్నారు. ఇది ఓర్వలేని పలమనేరు మార్కెట్ అధికారి, ఏడీ... రైతులకు ఇన్‌సెంటివ్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. మదనపలెలో 50మంది రీలర్లు ఉంటే పలమనేరులో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు.
అక్కడి మార్కెట్‌కు రైతులు తెచ్చిన సరుకు కొనేందుకు పలమనేరు రీల్లర్లు విముఖత చూపడంతో నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక రీలర్లకు ఇస్తున్నారని వాపోయారు. అనంతరం జేడీ మాట్లాడుతూ... రైతులు తమ పట్టుగూళ్లను ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ, అలాగే రీల్లర్లు ఎక్కడైనా కొనుగోలు చేసే హక్కు ఉందన్నారు. జిల్లాలోని ఏ మార్కెట్‌లో పట్టుగూళ్లు క్రయవిక్రయాలు జరిగినా అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తప్ప అధికారులకు సంబంధం ఉండదన్నారు. మార్కెట్ లావాదేవీలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీ విజయరామిరెడ్డి, మార్కెట్ ఇన్‌స్పెక్టర్లు రవి, నరసింహులు, పట్టు రీలర్లు పాల్గొన్నారు.