టీటీడీ కాటేజీల పునరుద్ధరణ పనులు కేటాయింపు
ABN , First Publish Date - 2020-10-08T16:19:37+05:30 IST
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వున్న విశ్రాంతి భవనాల పునరుద్ధరణ, నవీకరణ పనులకు..

తిరుమల(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వున్న విశ్రాంతి భవనాల పునరుద్ధరణ, నవీకరణ పనులకు కాటేజీ డొనేషన్ స్కీం కింద టెండర్లు దాఖలు చేసిన దాతలకు కేటాయింపులు ఖరారయ్యాయి. గతంలో దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించిన పలు విశ్రాంతి భవనాలను పునర్నిర్మించేందుకు, ఆధునికీకరించేందుకు ఓపెన్ టెండర్లను టీటీడీ పిలిచిన విషయం తెలిసిందే. 13 విశ్రాంతి భవనాలకు టెండర్లను ఆహ్వానించిన టీటీడీ 11భవనాల పునరుద్ధరణ, నవీకరణ పనులకు సంబంధించి దాతల కేటాయింపు ఖరారు చేసింది.
ఇందులో శ్రీపతి గెస్ట్‌హౌస్‌కు రూ.7.11 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, విద్యాసదన్‌కు రూ.7.89 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన జూపల్లి శ్వామ్‌రావు, స్నేహలత గెస్ట్‌హౌస్‌కు రూ.7.87 కోట్లతో చెన్నైకి చెందిన పిచమ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్, కరమ్ నివాస్ భవనానికి రూ.6.8 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన భూదాతి లక్ష్మీ నారాయణ, వకుళా విశ్రాంతి భవనానికి రూ.6.5 కోట్లతో ముంబైకి చెందిన రాజేష్‌శర్మ, గంబెల్ గెస్ట్‌హౌస్‌కు రూ.5.99 కోట్లతో చెన్నైకి చెందిన భాగ్యశ్రీ, శ్రీనికేతన్ గెస్ట్‌హౌస్‌కు రూ.5.98 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన శరత్‌చంద్రరెడ్డి, గోదావరి భవనానికి రూ.5.5 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్టర్ లిమిటెడ్, లక్ష్మీనిలయానికి రూ.5.25 కోట్లతో ముంబైకి చెందిన ఆఫ్‌కాన్స్ ఇన్ర్ఫాస్ట్రక్టర్ లిమిటెడ్, బాలాజీకుటీర్ భవనానికి రూ.5 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన ఓం ప్రకాష్ అగర్వాల్, శాంతిసదన్ విశ్రాంతి భవనానికి రూ.5 కోట్లతో బెంగుళూరుకు చెందిన ఎంఎస్ రక్షరామయ్య, సుందర్‌రామ్‌లకు టెండర్లు ఖరారు చేశారు. మొత్తం మీదుగా రూ.68.89 కోట్లు డిపాజిట్ల రూపంలో టీటీడీకి ఆదాయం సమకూరింది. దాతలు ఆయా విశ్రాంతి భవనాలను పునరుద్ధరించి టీటీడీకి అప్పగించనున్నారు.