అఖండ పారాయణంతో పులకించిన సప్తగిరులు

ABN , First Publish Date - 2020-12-07T06:42:42+05:30 IST

ప్రపంచ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఏడో విడత సుందరకాండ అఖండ పారాయణంతో సప్తగిరులు పులకించాయి.

అఖండ పారాయణంతో పులకించిన సప్తగిరులు
పారాయణంలో పాల్గొన్న పండితులు, అధికారులు 1

తిరుమల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఏడో విడత సుందరకాండ అఖండ పారాయణంతో సప్తగిరులు పులకించాయి. సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను దాదాపు 200 మంది వేదపండితులు పారాయణం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ అవధాని మాట్లాడుతూ.. ప్రజల యోగక్షేమం కోసం శ్రీవారి అనుగ్రహంతో 241 రోజులుగా పారాయణం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్యాపకులు వందన బృందం ‘దాశరథీ కరుణాపయోనిధి’ అనే సంకీర్తనను ప్రారంభంలో పాడారు. ముగింపులో టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ ‘శ్రీహనుమ సీతారామ ప్రియ హనుమ’ అనే కీర్తనను ఆలపించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉపకులపతి మురళీధరశర్మ, పండితులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-07T06:42:42+05:30 IST