లాఠీ తగిలి.. పళ్లు ఊడి..!

ABN , First Publish Date - 2020-07-28T10:47:04+05:30 IST

బైకును ఆపేందుకు కానిస్టేబుల్‌ అడ్డంగా పెట్టిన లాఠీ తగిలి యువకుడి రెండు పళ్లు ఊడిపోయాయి.

లాఠీ తగిలి.. పళ్లు ఊడి..!

ఆందోళనకు దిగిన యువకుడి బంధువులు

నచ్చజెప్పి బాధితుడికి చికిత్స చేయిస్తున్న ఈస్ట్‌ పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), జూలై 27: బైకును ఆపేందుకు కానిస్టేబుల్‌ అడ్డంగా పెట్టిన లాఠీ తగిలి యువకుడి రెండు పళ్లు ఊడిపోయాయి. తిరుపతిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటను సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులోని పల్స్‌ కూడలి వద్ద ఈస్ట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎస్టీవీ నగర్‌కు చెందిన జయచంద్రప్రసాద్‌(25) తన స్నేహితుడితో కలిసి టీవీఎస్‌ కూడలి నుంచి అన్నమయ్య కూడలి వైపు ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్నారు. పోలీసులు ఆపినా నిలపకుండా మరింత వేగంగా వెళ్లారు. మరికొద్ది దూరంలో ఉన్న స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ దీనిని గమనించి బైకుకు అడ్డంగావచ్చి.. లాఠీ అడ్డుపెట్టి ఆపేందుకు ప్రయత్నించారు.


ఈ క్రమంలో బైక్‌పై వేగంగా వెళ్తున్న జయంచంద్రప్రసాద్‌ పంటికి లాఠీ తగలడంతో రెండు పళ్లు విరిగిపోయాయి. యువకుడి బంధువులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాఠీలతో కొట్టడం వల్లే దంతాలు ఊడిపోయాయని ఆందోళనకు దిగారు. ఈలోపు ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకుని యువకుడి బంధువులతో మాట్లాడారు. వైద్యం చేయిస్తామంటూ సర్దిచెప్పారు. హుటాహుటిన బాధితుడిని ఓ ప్రైవేటు దంత వైద్యశాలకు తరలించారు. ఎలాగైనా ఆపాలని కానిస్టేబుల్‌ ప్రయత్నించిన క్రమంలో ప్రమాదవశాత్తు లాఠీ తగిలిందని సీఐ వెల్లడించారు. 


Updated Date - 2020-07-28T10:47:04+05:30 IST