వ్యవసాయబోరు పేల్చివేత

ABN , First Publish Date - 2020-12-01T05:39:19+05:30 IST

పలమనేరు మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ శాంతమ్మ వ్యవసాయ బోరును గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి పేలుడు పదార్థాలతో పేల్చివేశారు.

వ్యవసాయబోరు పేల్చివేత
దుండగులు పేల్చివేసిన వ్యవసాయబోరు

పలమనేరు, నవంబరు30 : పలమనేరు మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ శాంతమ్మ వ్యవసాయ బోరును గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన శాంతమ్మకు బోరుపై భాగంలో ఉన్నకేసింగ్‌ పైపులు విరిగిపోయి ఉండడం, పేలుడు పదార్థాల వాసన రావడాన్ని గుర్తించింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. పలమనేరు మున్సిపాలిటీ నీళ్లకుంటా గ్రామానికి చెందిన శాంతమ్మకు కొంత వ్యవసాయ పొలం ఉంది. అందులో బోరు ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు బోరులోపల పేలుడు పదార్థాలు ఉంచి పేల్చేశారు. కొంత పదార్థం పేలకుండా ఉండడంతో దాన్ని వెలికితీశారు. ఆ పేలుడు పదార్థాల కవర్‌పై శ్రీవిష్ణు ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, లక్ష్మీపురం నందనం గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా అనే చిరునామా ఉంది.  పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


స్థానికుల్లో అలజడి..

పలమనేరు ప్రాంతంలో పేలుడు పదార్థాలను అమర్చాల్సి వస్తే సమీపంలోని తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం, వేలూరు ప్రాంతాల నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది. అలా కాకుండా వందల కిందల కిలోమీటర్ల దూరంలోని తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా నుంచి ఇక్కడికి ఎలా తీసుకువచ్చారన్నదే అంతుచిక్కని ప్రశ్న. పలమనేరు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నందున సంఘవిద్రోహక శక్తులు పలమనేరులో ఉంటూ బయట తమ కార్య కలా పాలను కొనసాగిస్తూ ఉండచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నేడు బోరులో పెట్టిన పేలుడుపదార్థాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి వినియోగిస్తే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాధిత మాజీ కౌన్సిలర్‌ శాంతమ్మ వైసీపీ సానుభూతి పరురాలు కావడంతో ఆమెకు న్యాయం చేసి దుండగులను అరెస్టు చేయాలని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పోలీసులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. 

Updated Date - 2020-12-01T05:39:19+05:30 IST